
ప్రజలను అప్రమత్తం చేయండి
అనంతగిరి: ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ శుక్రవారం అధికారులకు సూచించారు. ఎండల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు ఎండల వల్ల కలిగే ముప్పు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం, చేనేత వస్త్రాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, చల్లదనం ఉండే చోటు ఉండాలన్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు నీడ, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రికి వస్తే తక్షణ చికిత్స చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరించండి
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు, మీటర్లు, బోరు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాటిని సమకూర్చాలని సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులను అలసత్వం చేయరాదని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవి ప్రసాద్, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్