రూ.40 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి | - | Sakshi
Sakshi News home page

రూ.40 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

May 3 2025 8:41 AM | Updated on May 3 2025 8:41 AM

రూ.40 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

రూ.40 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముప్పై ఏళ్ల క్రితమే కబ్జాకు గురైన రూ.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు మూడు రోజుల క్రితం విముక్తి కల్పించారు. ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయడంతో పాటు భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ డివిజన్‌ సర్వే నంబర్‌ 86లో 1.21 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఓ పార్టీకి చెందిన నేత దీనిపై కన్నేశాడు. పక్కనే ఉన్న ప్రైవేటు పట్టాదారును ఉసిగొల్పి ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలిపేందుకు యత్నించాడు. ఇప్పటికే ఆ భూమిలో నాలుగు తాత్కాలిక గదులు నిర్మించి కూలీలకు అద్దెకిచ్చాడు. ఇతరులెవరినీ లోనికి అడుగు పెట్టకుండా ప్రైవేటు సెక్యురిటీతో నిఘా ఏర్పాటు చేశాడు. ఖాళీ స్థలాన్ని తన సొంత స్థలంగా నమ్మించి అందులో ప్రైవేటు కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాల పార్కింగ్‌ కోసం అద్దెకిచ్చాడు. విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. ఏళ్లుగా ప్రైవేటు వ్యక్తి చెరలో చిక్కిన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించాలని నిర్ణయించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ క్షేత్రస్థాయికి చేరుకుని భూమిని పరిశీలించారు. నాలుగు నెలల్లో మూడుసార్లు పరిశీలించడంతోపాటు పక్కగా సర్వే చేయించారు. మూడు రోజుల క్రితం చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్‌ వేయించారు. తాత్కాలిక గదుల్లో అద్దెకున్న వారంతా వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. లేదంటే ఆ నివాసాలను కూల్చివేయనున్నట్లు హెచ్చరించారు. ఇదే భూమికి సమీపంలో ఉన్న మరో 250 గజాల స్థలాన్ని కూడా అధికారులు రక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement