
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు డీలా
బంట్వారం: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సంస్థ సేవలు నానాటికి కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ప్రతీ గ్రామంలో సేవలు అందుబాటులో ఉండేవి. మొదట్లో ఏరియా పరిధిలోని టెలిఫోన్ ఎక్చేంజ్‌ల నుంచి రోడ్డు వెంట స్తంభాలు ఏర్పాటు చేసి గ్రామాలకు ల్యాండ్ ఫోన్ సౌకర్యం కల్పించారు. అనంతరం కేబుల్ ద్వారా టెలిఫోన్ వ్యవస్థను నడిపించారు. కాలక్రమంలో ల్యాండ్ ఫోన్లు కనుమరుగయ్యాయి. సెల్‌ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో ఒకప్పుడు బాగా నడిచిన ఎస్టీడీ, ఐఎస్డీ టెలిఫోన్ బూత్‌లు మూతబడ్డాయి. తదనంతరం వచ్చిన కాయిన్ బాక్స్‌లు కథ కంచికి చేరింది. 30 ఏళ్ల క్రితం పరుగులు పెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు ఇప్పుడు పూర్తిగా డీలా పడ్డాయి. బంట్వారం, ఎన్నారం గ్రామాల్లో 25 సంవత్సరాల క్రితమే టెలిఫోన్ ఎక్చేంజ్‌లు ఏర్పాటు చేశారు. అప్పట్లో వీటికి పక్కా భవనాలు సైతం నిర్మించారు. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు నిలిచి పోవడంతో ఈ భవనాలు వృథాగా మారాయి.
సెల్‌ఫోన్ల రాకతో తగ్గిన వినియోగం
సెల్‌ఫోన్లు మార్కెట్‌లోకి రావడంతో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు తగ్గుతూ వచ్చాయి. వివిధ ప్రైవేటు కంపెనీలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్శిస్తూ మార్కెట్‌లో దూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో బీఎస్‌ఎన్‌ఎల్ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రస్తుతం పట్టణాలకే పరిమితమైంది. అక్కడక్కడ కొనసాగే ఇంటర్నెట్ కనెక్షన్లతోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నారు. ఇప్పటికై నా సంబందిత టెలికమ్యూనికేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
కనుమరుగైన ల్యాండ్ ఫోన్లు
మూతబడిన ఎస్టీడీ బూత్‌లు
నిరుపయోగంగా మారిన టెలిఫోన్ ఎక్చేంజ్ భవనాలు

బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు డీలా