
రద్దీ ప్రదేశాలే లక్ష్యం
పరిగి: రద్దీగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిగి సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. గత నెల 17న పరిగి బస్టాండ్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పాత నేరస్తులను విచారించి, వివిధ బస్టాండ్లలో జరిగిన చోరీల వివరాలను తెలుసుకుని, ఒక నిర్ధారణకు వచ్చారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గుంజల గిద్దన్న, అతని భార్య ఆగిరమ్మ, కూతురు కీర్తి, అతని బావ ప్రసాద్‌ను నిందితులుగా గుర్తించారు. బస్టాండ్లు, రద్దీ ప్రదేశాలే టార్గెట్‌గా చోరీలు చేసి, సొంతూరుకు ఉడాయిస్తారని తెలుసుకున్నారు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో సిద్దాపురం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం నిందితులను పట్టుకుని, విచారించగా నేరం అంగీకరించారు. వీరినుంచి మూడు తులాల బంగారం, రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏ– 1 నిందితుడుగిద్దన్నపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆగిరమ్మపై పెబ్బేరు, వనపర్తి, పంజాగుట్ట పీఎస్‌లలో కేసులు ఉన్నాయన్నారు. దొంగలను పట్టుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్, సిబ్బంది గోపాల్, జావిద్, బాలునాయక్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
బస్టాండ్లలో చోరీలకు తెగబడుతున్న ముఠా
దోచుకున్న సొమ్ములు, డబ్బుతో స్వగ్రామానికి ఉడాయింపు
గత నెల 17న పరిగి బస్టాండ్‌లో నగలు, నగదు చోరీ
నిందితులను కటకటాల్లోకి పంపిన పోలీసులు
వివరాలు వెల్లడించినపరిగి డీఎస్పీ శ్రీనివాస్