
సీడ్స్ షాప్‌లో నకిలీ మందులు విక్రయం
యజమానిపై కేసు
షాబాద్: నకిలీ మందులు విక్రయిస్తున్న న్యూ మారుతి సీడ్స్ దుకాణం పై కేసు నమోదయింది. ఈ ఘటన శుక్రవారం షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని నాగర్‌గూడలో ఉన్న న్యూ మారుతి సీడ్స్ షాపులో సింజెంట కంపెనీకి చెందిన నకిలీ మందులు విక్రయిస్తున్నారని సదరు కంపెనీ మేనేజర్ కేషమసుధీర్‌కు సమాచారం అందింది. దీంతో అతడు అదే కంపెనీలో పనిచేసే రాకేశ్‌తో సినోడిస్ 200 మి.లీల మందు కొనుగోలు చేయించాడు. సదురు మందు డబ్బాపై ఉన్న లోగోలు వేరుగా ఉన్నట్లు గమనించి అది నకిలీదని గుర్తంచారు. షాపు యజామాని రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సింజెంట కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
● విరిగిపడిన స్తంభం
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో విద్యుత్, కేబుల్ వైర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున పట్టణంలోని ఈశ్వరాంజనేయ స్వామి ఆలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణం నుంచి రాయపోల్ వెళ్లే మార్గంలోని ఈశ్వరాంజనేయ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం స్తంభాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి వవిద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బస్తీవాసులు భయాందోళనకు గురయ్యారు. జనసంచారం లేని సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.