
బీజేపీతోనే నూతన సంస్కరణలు
పరిగి: అరవైఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కులగణన చేపట్టలేదని.. నూతన సంస్కరణలు బీజేపీతోనే సాధ్యమని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని నిర్ణయించడంతో శుక్రవారం బీజేపీ శ్రేణులు ప్రధాని మోది చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ.. కులగణనతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. దేశంలోని అన్ని పార్టీలు కులగణను స్వాగతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన కులగణన అశాస్త్రీయంగా ఉందని.. కేంద్రం నిర్వహించే జనగణనతోనే ప్రజలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాముయాదవ్, కార్యదర్శి పెంటయ్యగుప్తా, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య