కొహెడలో భూ వివాదం | - | Sakshi
Sakshi News home page

కొహెడలో భూ వివాదం

May 2 2025 4:10 AM | Updated on May 2 2025 4:10 AM

కొహెడలో భూ వివాదం

కొహెడలో భూ వివాదం

హయత్‌నగర్‌: ఓ భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ సర్వే నంబర్‌ 951, 952లోని సుమారు ఏడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కంగుల రాములు, పోచయ్యతో పాటు మరికొంత మంది నుంచి కంగుల గండయ్య, ఈదయ్య జీపీఏ చేసుకున్నారు. అనంతరం 1970లో ఈస్థలంలో 170 ప్లాట్లు చేసి విక్రయించారు. అయితే ఈ జీపీఏ చెల్లదంటూ కంగుల కుటుంబానికి చెందిన పలువురు వారసులు, ఇదే భూమిని 2013లో బ్రాహ్మణపల్లికి చెందిన సంరెడ్డి బాల్‌రెడ్డికి విక్రయించారు. ఆయన కొంత విస్తీర్ణంలో ఫాంహౌస్‌తో పాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ప్లాట్ల యజమానులు, బాల్‌రెడ్డికి మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించగా 28 మార్చి 2025న జిల్లా న్యాయస్థానం వీరికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఆధారంగా ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో లే అవుట్‌ రోడ్లను ఆక్రమించి ఫాంహౌస్‌ నిర్మించారనే కారణంతో రెండు నెలల క్రితం హైడ్రా అధికారులు ఫాంహౌస్‌ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చేశారు. దీన్ని సవాలు చేస్తూ బాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇందులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా కొంతమంది ప్లాట్ల ఓనర్లు గురువారం తమ స్థలాలను చదను చేసుకునేందుకు జేసీబీ తీసుకుని వెళ్లారు. ఇది గమనించిన బాల్‌రెడ్డి, అతని అనుచరులు దిలీప్‌రెడ్డి, శీలం శ్రీను తదితరులు ప్లాట్ల యజమానులైన సత్యనారాయణరెడ్డి, పండుగల వెంకటేశ్‌, నవీన్‌రెడ్డి, బద్రి అశోక్‌, రఘు వెంకట్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. బాల్‌రెడ్డి వర్గం వారు రాళ్లు, కర్రలు, గడ్డి కత్తిరించే కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణరెడ్డి, నవీన్‌, వెంకటేశ్‌కు గాయాలయ్యాయి. వీరి ప్రతిఘటనతో బాల్‌రెడ్డికి సైతం గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇరువర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలు

కేసు నమోదు చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement