
ఔత్సాహికులను ప్రోత్సహించాలి
అనంతగిరి: వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో నూతన ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, నూతన పెట్రోల్ పంపులు, ఎల్‌పీజీ, మత్స్య సంఘాలు, డెయిరీ ఫాంలు, గోదాములు, ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా సహకార అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. రైతుల అవసరాలకు అనుగుణంగా అదనంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కొత్త పెట్రోల్ పంపులు, ఇప్పటికే ఉన్న పెట్రోల్ పంపుల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. జన ఔషధి కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకార్ సమితి లిమిటెడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగార్జున, నాబార్డ్ డీడీఎం అఖిల్, జిల్లా సెంట్రల్ బ్యాంక్ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సదానందం, వ్యవసాయ అధికారి పద్మావతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్