
మహనీయుల ఆశయాలకు కృషి
జనజాతర సభలో ప్రొ. రవీందర్
తాండూరు టౌన్: మనువాదంపై మహోద్యమం చేపట్టాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేడ్కర్ జన జాతర సభకు ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తుది శ్వాస వరకు మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. నేటి కాలంలో మహనీయులను ఒక కులానికి మాత్రమే పరిమితం చేయడం ద్వారా వారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. మనుస్మృతి శూద్రులకు విద్యను నిషేధిస్తే, పూలే దంపతులు అందరికీ విద్యనందించారన్నారు. పురుష, మహిళ అనే భేదం లేకుండా సమానత్వం కోసం నాటి అనాగరిక సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కేవలం భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కొలుస్తూ, ఆయన అధ్యయన లోతులను విస్మరిస్తున్నారన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తీరుతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కాసుల వర్షం కురిపించేందుకు కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తెస్తోందన్నారు. నేటి యువతకు పూలే, అంబేడ్కర్ ఆశశయాలను చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కన్న, ఉపాధ్యక్షుడు మహిపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు బుగ్గప్ప, ఆనంద్, సురేష్, రాజు, గోపాల్, చంద్రయ్య, శ్రీనివాస్, బలరాం, రఘుపతి, రవి తదితరులు పాల్గొన్నారు.