
కుల్కచర్ల పీఏసీఎస్ కార్యాలయం
కుల్కచర్ల: రాజకీయాల్లో ఏ క్షణం ఎటువంటి మా ర్పులు చోటుచేసుకుంటాయో ఊహించలేం. అటువంటి సందర్భమే కుల్కచర్ల మండలంలో ప్రస్తుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేస్తున్న బుయ్యని మనోహర్‌రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాండురు ఎమ్మేల్యేగా గెలుపొందడంతో తాను ముందుగా పనిచేస్తున్న పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 2020లో కుల్కచర్ల ప్రాథమిక సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మనోహర్‌రెడ్డి తన రాజకీయ చాణక్యంతో ఇతర పార్టీల నేతలను సమన్వయపరుచుకుని పోటీలో ఎవరూ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేవిధంగా చూసుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికై న అనంతరం ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు కుల్కచర్ల మండల పరిధిలోని గ్రామాలతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా రైతాంగ అభ్యున్నతికై సహకార సంఘం ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పు లు తెచ్చారు. అనంతరం పరిగి నియోజకవర్గ ఎమ్మె ల్యే స్థానం నుంచి పోటీచేయాలనుకున్న ఆయనకు అధిష్టానం తాండురు నియోజకవర్గం నుంచి ఛాన్స్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో ఆయన తాండూరు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చైర్మన్ హోదా ఎవరికి దక్కేనో..
బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రస్తుతం తాండురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇతర ఏ పదవుల్లో కొనసాగేందుకు దాదాపుగా అవకాశం లేదు. కుల్కచర్ల మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండు సంవత్సరాల కాలంపాటు ఆ పదవీకాలం కొనసాగనుండగా మనోహర్‌రెడ్డి రాజీనామా చేస్తే చైర్మన్ హోదాలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పెంచుకున్న నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్ పదవిని సైతం తన ఖాతాలో వేసుకుంటుందా లేదా ప్రస్తుతం ఉన్న వైస్ చైర్మన్ లేదా ఎవరైనా డైరక్టర్లు చైర్మన్‌గా ఎన్నిక కానున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరికొద్దిరోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన మనోహర్‌రెడ్డి
కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి
చైర్మన్ పీఠంపై సభ్యుల గంపెడాశలు