
వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్: సొంతూరు నుంచి ప్రస్థానం ప్రారంభించిన నేతలెందరో ఉన్నతంగా ఎదిగారు. ప్రతిపక్ష నాయకుల మాటలను తిప్పి కొట్టేందుకు వారి ఊరును అభివృద్ధిలో చక్కబెట్టుకుని క్రమ క్రమంగా ప్రయాణం సాగిస్తుంటారు. గ్రామ ఓటు బ్యాంకు సైతం గెలుపోటములను శాసిస్తాయనడంలో సందేహమే అవసరం లేదు. షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్, బీఆర్‌ఎస్ నుంచి అంజయ్య యాదవ్ పోటీ పడ్డారు. వారి వారి స్వగ్రామాల్లో వారిదే పై చేయిగా నిలిచింది.
● కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ గ్రామం వీర్లపల్లిలో 1175 మంది హస్తానికి, 834 మందకి కారుకు ఓటేశారు.
● బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ గ్రామం ఎక్లాస్‌ఖాన్‌పేటలో కారుకు 972 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్‌కు 493 మంది ఓటేశారు.
అధిక శాతం పోలింగ్ నమోదు
బరిలో ఉన్న అభ్యర్థుల సొంత గ్రామాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో 2,525 మంది ఓటర్లు ఉండగా 2,227 ఓట్లు పోలయ్యాయి. ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,725 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,558 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత గ్రామాల్లో అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం, అభ్యర్ధులకు చెందిన మద్దతు దార్లు ఓటర్లను చైతన్యం చేయడం, నేను మీఊరి వాడినే గెలిపిస్తే ఊరు మరింత అభివృద్ధి చెందుతుందని అభ్యర్ధులు హామీలు ఇవ్వడం తదితరాలు ఓటింగ్ శాతం పెంపునకు కారణమయ్యాయి.
సొంత గ్రామాల్లో సత్తాచాటిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు
వీర్లపల్లి, ఎక్లాస్‌ఖాన్‌పేటలో భారీగా నమోదైన పోలింగ్
నోటాకు ఓటేశారు
ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్ధులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్ధుల సొంత గ్రామాల్లోనూ పలువురు ఓటర్లు అభ్యర్ధులెవరు నచ్చకపోవడంతో నోటాకు ఓటేశారు. వీర్లపల్లిలో 11 మంది, ఎక్లాస్‌ఖాన్‌పేటలో 8 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు.

అంజయ్య యాదవ్