
తాండూరు: భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. సూర్యోదయం నుంచే ఎండ దంచి కొడుతోంది. వారం రోజుల క్రితం కురిసిన వర్షం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మూడు రోజుల పాటు తీవ్రమైన మంచు, చలి విసిరింది. రెండు రోజులుగా తిరిగి వేడి రాజుకుంటోంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరులోనే ఎండ తీవ్రత ఇంతగా ఉందంటే ఏప్రిల్, మేలో పరిస్థితులపై జనంజంకుతున్నారు.
జనం అవస్థలు
జిల్లాలోని అన్ని మండలాల్లో ఉష్రోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గరిష్టంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంట్వారం మండలంలో అత్యధికంగా 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యాలాలలో 37.7, మర్పల్లిలో 37.3 డిగ్రీల చొప్పున రికార్డయ్యింది. వారం రోజుల క్రితం వరకు 30 నుంచి 32 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు మూడు రోజులుగా ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పొద్దంతా తిరుగుతున్నాయి.
ఎండుతున్న వరి
ఎండ ప్రభావంతో ఇప్పటికే పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు బోరుబావులు వట్టిపోతున్నాయి. వేసవిలోప్రధాన పంటగా సాగవుతున్న వరికి నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే పలు చోట్ల వరి చేలు ఎండిపోతున్నాయి.
దంచికొడుతున్న ఎండ
ఉదయం 7గంటల నుంచే సూర్యుడి ఉగ్రరూపం
వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
సాగునీటి కొరతతో ఎండుతున్న పంటలు