
ఎల్మకన్నె అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటిస్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి
తాండూరు రూరల్: ‘ఇసుక రవాణా, నాపరాతి మైనింగ్, సుద్ద తవ్వకాలపై దృష్టి సారిస్తా.. పల్లెటూరులోనే పుట్టిపెరిగినోన్ని.. ప్రజల సమస్యలు నాకు తెలుసు’ అని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. తాండూరు మండలం ఎల్మకన్నెలో బుధవారం మూడు గంటల పాటు పర్యటించారు. రూ.7 కోట్లతో గ్రామశివారులోని వాగు వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు పరిశీలించారు. మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఈఈ సుందర్‌తో పాటు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వేసవికాలంసందర్భంగా గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.
విద్యా వ్యవస్థను గాడిలో పెట్టండి..
ఎల్మకన్నె ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ 4, 5వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గణితంలో గుణింతాలు, సరి, బేసి సంఖ్యలు, భాగహారం, భిన్నాలపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు వెనకబడి ఉండటాన్ని గమనించి అసహనం వ్యక్తంచేశారు. మ్యాథ్స్ టీచర్ హర్షవర్ధన్ (మల్కయ్య)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని డీఈఓ రేణుకాదేవికి ఫోన్ చేసి చెప్పారు.
కార్యదర్శికి మెమో..
స్కూల్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలు, హన్‌మాన్ ఆలయం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి సరితపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కంపోస్ట్ షెడ్ అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఎంపీడీఓ సుదర్శన్‌రెడ్డిని ఆదేశించారు.
మనసు పెట్టి పని చేయాలి..
ఉద్యోగులు, సిబ్బంది జీతం కోసం కాకుండా మనసు పెట్టి, మానవత్వంతో పని చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఎల్మకన్నెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో మాట్లాడారు. గర్భిణులకు ప్రతినెలా పౌష్టికాహారం పంపిణీ చేయాలని సూచించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. బాలింతలకు పౌష్టికాహారం అందజేయాలని సీడీపీఓ రేణుకకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఎంపీడీఓ సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ రాజ్ డీఈ వెంకట్రావ్‌రావు, ఏఈ నందిని, మిషన్ భగీరథ డీఈ రమేశ్, ఏఈ ప్రణీత్, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాస్, డీఎల్‌పీఓ శంకర్‌నాయక్, ఏంపీఓ రతన్‌సింగ్, ఏపీఓ నరోత్తంరెడ్డి, సర్పంచు నాగమణి, నాయకులు జగదీశ్ తదితరులు ఉన్నారు.
పల్లెటూరిలోనే పుట్టిపెరిగా..ప్రజల సమస్యలు తెలుసు
కలెక్టర్ నారాయణరెడ్డి
ఎల్మకన్నెలో ముమ్మర పర్యటన
మ్యాథ్స్ టీచర్‌పై వేటు,పంచాయతీ కార్యదర్శికి మెమో

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్