
వికారాబాద్: రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం తొలి విడత లబ్ధిదారుల్లో సగం మందికి జీవాలు పంపిణీ చేసిన తర్వాత అర్ధంతరంగా ఆపేశారు. అప్పటినుంచి నానుస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు రెండో విడత పంపిణీకి పచ్చజెండా ఊపింది. దీంతో యాదవులు, గొల్లకుర్మల నిరీక్షణకు తెరపడనుంది.
ఆర్థిక చేయూతే లక్ష్యంగా..
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు గొల్లకుర్మలకు ఆర్థిక చేయూతనివ్వాలనే సంకల్పంతో 2017లో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రెండు విడతల్లో లబ్ధిదారులందరికీ యూనిట్లు అందజేయాలని భావించింది. జిల్లాలోని 311 సొసైటీల్లో సభ్యులుగా నమోదైన 18 సంవత్సరాలు నిండిన వారందరికీ యూనిట్ అందజేసేలా విధివిధానాలు రూపొందించింది. అయితే మొదటి విడతలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పథకంలో మార్పులు చేపట్టింది. అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు జీవాల రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఒక్క యూనిట్‌ను కూడా పంపిణీ చేయకపోవడంతో పట్టణ లబ్ధిదారులు అసంతృప్తికి లోనయ్యారు. ప్రస్తుతం రెండో విడత పంపిణీకి సిద్ధమవుతున్న క్రమంలోనూ ఈ విషయమై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
కసరత్తు ప్రారంభం
మలి విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధ వారం అడిషనల్ కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీవాల ట్రా న్స్‌పోర్ట్‌కు టెండర ప్రక్రియపై చర్చించారు. గతంలో గొర్రెల కాపరులు తమ వాటా కింద 25 శాతం డబ్బులను డీడీల రూపంలో ఇచ్చే వారు.. ప్రస్తుతం నేరుగా కలెక్టర్ ఖాతాలో జమ చేసేలా విధివిధానాలు రూపొందించారు. ప్రభుత్వ వాటా 75శా తం నిధులు కలెక్టర్ అకౌంట్‌లో జమైన వెంటనే జీ వాలు కొనుగోలు చేసి, యూనిట్లు పంపిణీ చేస్తారు.
పంపిణీ లక్ష్యం 11,071 యూనిట్లు
జిల్లాలో 22,025 మంది సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారు. 2017– 18 సంవత్సరానికి సంబంధించి గొర్రెల పంపిణీ లక్ష్యం 10,954 యూనిట్లు కాగా, 2018 జూన్ చివరినాటికి 10,078 యూనిట్లు పంపిణీ చేశారు. మొదటి విడతకు సంబంధించి మరో 876 యూనిట్లు అందజేయాల్సి ఉంది. ఇందులో లబ్ధిదారులు చెల్లించిన 490 డీడీలు పశుసంవర్ధక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 11,071 యూనిట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక యూనిట్‌పై 75శాతం సబ్సిడీ అందజేయనుంది. యూనిట్ విలువ గతంలో రూ.1.25 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.1.75 లక్షలకు పెంచారు. ఇందులో లబ్ధిదారుడి వాటా రూ.43,250 పోను మిగతా సొమ్మును ప్రభుత్వం భరిస్తోంది. ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు సబ్సిడీ కింద తన వాటాగా రూ.1,31,750 చెల్లిస్తోంది. ప్రతీ గొర్రెకు ప్రభుత్వమే బీమా చేస్తుంది. ప్రీమియం డబ్బులను సైతం యూనిట్ విలువలోనే జత చేయడంతో ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి అవసరంలేదు. ఒక్కో యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తారు.
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏర్పాట్లు ప్రారంభించిన పశుసంవర్ధక శాఖ
సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష
మొదటి విడతలో 10,954 యూనిట్లు మంజూరు
మలి విడత లక్ష్యం 11,073 యూనిట్లు
పూర్తి సబ్సిడీ ఇవ్వాలి
మొదటి విడత గొర్రెల పంపిణీ ప్రారంభించి ఐదేళ్లు దాటింది. కొంతమందికి ఇంకనూ జీవాలు రాలేదు. అప్పటి నుంచి రెండో విడత పంపిణీ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పెండింగ్ యూనిట్లతో పాటు రెండో విడతకు సంబంధించిన వందశాతం యూనిట్లను పూర్తి సబ్సిడీతో అందజేయాలి.
– కాశయ్య,గొల్లకుర్మల సహకార సంఘం నేత
