అప్పు చెల్లించలేదని తాళం

మొగులయ్య ఇంటికి తాళం - Sakshi

దోమ: వడ్డీ డబ్బు కోసం ఓ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టి తాళం వేసిన ఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దిర్సంపల్లికి చెందిన పీ చిన్న మొగులయ్య, నీలమ్మ దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నారాయణపేట జిల్లా కోస్గీ మండలం సర్జాఖాన్‌ పేట్‌ గ్రామానికి చెందిన పీ నరేశ్‌తో మూడు సంవత్సరాల క్రితం రూ. 2లక్షలు అప్పు తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం అప్పు చెల్లించారు. అయితే వడ్డీ డబ్బు కట్టలేకపోయారు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం నరేశ్‌ తమ కుటుంబాన్ని ఇంట్లో నుంచి గెంటేసి తాళం వేశాడని మొగులయ్య తెలిపారు. నాలుగు రోజులుగా పిల్లలతో ఆరుబయటే ఉన్నట్లు వివరించాడు. అయితే వడ్డీ డబ్బు చెల్లించడానికి కొంత సమయం కావాలని కోరినా వినకుండా ఇంటికి తాళం వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇచ్చిన డబ్బులే ఇవ్వలేదు

తన వద్ద మొగులయ్య రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడని నరేశ్‌ తెలిపాడు. తాను డబ్బు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నాడు. అయితే డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టడం వల్లే ఇంటికి తాళం వేశానని తెలిపాడు. గ్రామస్తుల సహకారంతో మొగులయ్యకు మళ్లీ తాళం ఇవ్వడానికి వెళితే తీసుకోలేదన్నాడు. ఈ విషయంపై ఎస్‌ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. మొగులయ్య ఇంటికి నరేశ్‌ తాళం వేసిన విషయం తెలిసిందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఆరుబయటే జీవనం

సాగిస్తున్న కుటుంబం

దిర్సంపల్లిలో ఘటన

ఆలస్యంగా వెలుగులోకి

పోలీసులకు ఫిర్యాదు

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top