మార్కులు కేవలం జ్ఞాపకశక్తికి సంబంధించిన అంకెలే.. విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించలేవంటున్న మేధావులు పరీక్ష తప్పితే కుంగిపోవద్దు పిల్లలను ఇరుగుపొరుగుతో పోల్చే సంస్కృతి మారాలి పరీక్షల ఫలితాల సమయం ఆసన్నం..
పరీక్షా కాలం ముగిసింది. ఇక ఫలితాల సమయం ఆసన్నమైంది. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుధవారం ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం. పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయంటే విద్యార్థులు ఒకింత మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. పరీక్షలలో తప్పడం, అనుకున్న దానికంటే తక్కువ మార్కులు రావడం, తల్లిదండ్రులు మందలిస్తారని, బంధుమిత్రులు హేళన చేస్తారని మానసిక క్షోభ అనుభవిస్తూ కుంగిపోతుంటారు. వాటి ఫలితంగా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. జిల్లాలో ప్రతి ఏడాది పరీక్షా ఫలితాలు వెల్లడైన సందర్భంగా తల్లిదండ్రుల కడుపుకోత మిగిల్చిన ఘటనలు కోకొల్లలు.
తిరుపతి సిటీ: విద్యార్థులు పరీక్ష తప్పినంత మాత్రాన ఎందుకూ పనికిరారని తల్లిదండ్రులు, బంధువులు ముద్ర వేస్తూ వారిని మానసికంగా హింసించే సంస్కృతి మారాలి. పరీక్షలలో సాధించిన మార్కులు జీవితానికి కొలమానం కాదు. ఇవి కేవలం జ్ఞాపకశక్తికి సంబంధించిన అంకెలు మాత్రమే. విద్యార్థుల భవిష్యత్తును మార్కులు శాసించలేవు. పరీక్షలలో తప్పిన విద్యార్థులను తల్లిదండ్రులు మందలించడం మాని, వారికి ధైర్యం చెప్పి, ప్రోత్సహించాలి. అప్పుడే వారు మరింత దృఢంగా తయారై ఏ పరీక్షలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం, తక్కువ మార్కుల వచ్చిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ, ఇన్‌స్టెంట్, ఇంప్రూవ్‌మెంట్ రూపంలో ప్రతి ఏడాది ఫలితాలు విడుదలైన కేవలం నెల రోజులలోనే పరీక్షల మళ్లీ నిర్వహిస్తారు. అందులో విజయం సాధించేందుకు కృషి చేయాలి
తల్లిదండ్రులూ.. ఇవి పాటించండి!
పరీక్ష ఫలితం విద్యార్థులకు కొలమానం కాదు
సమాజంలో మార్పు రావాలి
ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు విద్యార్థులను ర్యాంకులు, మార్కుల పేరుతో ఒత్తిడిని చేయడం దారుణం. గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అవ్వాతాతలు, రక్త సంబంధీకులు ఉండటంతో విద్యార్థులు వారి సలహాలు సూచనలు పాటిస్తూ ఒత్తిడికి దూరంగా ఉండే వారు. ప్రస్తుతం చిన్న కుటుంబాలలో భార్యాభర్త, పిల్లలు వేరుగా నివశిస్తూ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లుగా చూడాలని ఏదో సాధించాలనే విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోయి తక్కువ మార్కులు వస్తే ఇక జీవితం లేదనే ఆలోచనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువే జీవితం కాదు ప్రపంచంలో ఎన్నో రంగాలలో రాణివంచవచ్చనే విషయాన్ని విద్యార్థి దశలో తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు ఉంది. – డాక్టర్ నాగేశ్వరరావు, మానసిక వైద్య నిపుణుడు, తిరుపతి


