తిరుపతి జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు..ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా జెండా పాతేయొచ్చు. అధికారులున్నారనే కదా.. అని మీ అనుమానం. ఇదంతా షరా‘మామూలే’ అంటూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దీంతో రూ.కోట్ల విలు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లాలో అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు..ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా జెండా పాతేయొచ్చు. అధికారులున్నారనే కదా.. అని మీ అనుమానం. ఇదంతా షరా‘మామూలే’ అంటూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దీంతో రూ.కోట్ల విలు

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

● వాగు పోరంబోకు భూమిలో పక్కా భవన నిర్మాణాలు ● ఇనాం భూమిలో తాత్కాలిక షెడ్ల నిర్మాణాలు ● ఒక్కో ప్లాటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు విక్రయం ● తిరుపతి రూరల్‌లో టీడీపీ నేత ముఖ్య అనుచరుడి దర్జా

దామినేడులో ఆరు ఎకరాల భూమి ఆక్రమణ

ఇనాం భూమిలో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి కూత వేటు దూరం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన వాగు పోరంబోకు, ఇనాం భూమి ఆక్రమణకు గురవుతోంది. టీడీపీ నేత ముఖ్య అనుచరుడు దర్జాగా కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడు. రూ.కోట్లు విలువచేసే భూములు యథేచ్ఛగా ఆక్రమించి, సొమ్ము చేసుకుంటున్నా ఉన్నతాధికారులు కానీ, స్థానిక రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రగిరి నియోజక వర్గం తిరుపతి రూరల్‌ మండలం దామినేడు పరిధిలో సర్వే నంబర్‌ 185/1లో 2.56 ఎకరాలు, సర్వే నంబర్‌ 207, 208లోని సుమారు 4 ఎకరాల ఇనాం భూమి ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమి పది రోజులుగా ఆక్రమణలకు గురవుతోంది. ఇటీవలే ఆ భూములకు ఆనుకుని కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. న్యాయస్థాన భవన నిర్మాణాలు చేపట్టనుండడంతో రహదారి ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారికి, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రోడ్డుకి ఆనుకుని వాగు పోరంబోకు, ఇనాం భూములు ఉండడంతో స్థానిక టీడీపీ నాయకుని కన్నుపడింది. జిల్లాకు చెందిన ముఖ్య నాయకుని అండదండలతో ఇద్దరు రెవెన్యూ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన టీడీపీ నాయకుడు ప్లాట్లు వేసి బేరం పెట్టారు.

అధికారం మాదే.. మీకేం కాదని చెప్పి..

వాగు పోరంబోకు భూమి, ఇనాం భూముల్లో ఒక్కో ప్లాటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున విక్రయించటం ప్రారంభించారు. తిరుపతికి అతి సమీపంలో.. జాతీయ రహదారికి ఆనుకున్న తక్కువ ధరకు ఇంటి ప్లాటు విక్రయిస్తున్నారని తెలుసుకున్న కొందరు కూడబెట్టుకున్న సొమ్ము, అప్పులు చేసి కొనుగోలు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసుకున్న ప్లాటుకు సంబంధించి రికార్డులు అడిగితే.. ‘అధికారం మాదే.. మీకేం కాదు.. ఇల్లు కట్టేసుకోండి, నేను చూసుకుంటాను’ అని వారికి మాయ మాటలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక పేపర్‌లో నంబర్లు వేసి, సంతకాలు చేసి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. వాటిని నమ్మి అమాయకులైన జనం ఆ ప్లాట్లను కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు.

వాగు పోరంబోకు భూమిలో జరుగుతున్న నిర్మాణాలు

అక్రమ నిర్మాణాలు చేపడితే

ఎప్పటికై నా కొట్టేయాల్సిందే

అధికార పార్టీ వారి మాయమాటలు నమ్మి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్న వారికి ఆ భూమి వాగు పోరంబోకు, ఇనాం భూములని తెలియకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. కొనుగోలు చేసే వారంతా స్థానికేతరులు కావడంతో టీడీపీ నాయకుని ఆటలు సాగుతున్నాయంటున్నారు. కలెక్టరేట్‌కి కూత వేటు దూరంలో ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతుంటే అధికారులకు తెలియకుండా ఉండదని స్థానికులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికై నా కూలదోయాల్సిందేనని రెవెన్యూ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement