విషమ పరీక్ష
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నూతన సిలబస్.. సరికొత్త పరీక్షల విధానం
ఫిబ్రవరి నుంచి పరీక్షలు.. 60 శాతం కళాశాలలో పూర్తికాని సిలబస్
జేఈఈ, నీట్, ఎమ్‌సెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి
ఆగమ్యగోచరం
విద్యార్థులకు అవగాహన కల్పించడంలో కళాశాలలు వైఫల్యం
డిసెంబర్ వచ్చినా సగం సిలబస్ కూడా పూర్తి కాక.. మార్చినెట్టా గట్టేక్కేది అంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు నూతన పరీక్షల విధానం వీరిని మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. కొత్త విధానంపై అవగాహన లేకపోవడంతో పరీక్షల భయం వెంటాడుతోంది.
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ విద్యామండలి వ్యవహార శైలితో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొకోక తప్పడం లేదు. నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ఇంటర్మీడియల్‌లో మొదటి సంవత్సరం సిలబస్‌ను పూర్తిగా మార్చేశారు. నూతన సిలబస్‌తో పరీక్షా విధానంలోనూ పెనుమార్పులు తీసుకొచ్చారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం అడ్మిషన్లు అక్టోబర్ వరకు కొనసాగాయి. దీంతో మూడు నెలల వ్యవధిలో నూతన సిలబస్‌పై పట్టు సాధించడం అసాధ్యమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. పరీక్షల విధానం, నూతన సిలబస్‌పై జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 80శాతం మంది విద్యార్థులు అవగాహన లేకపోవడం గమనార్హం.
ఫిబ్రవరిలో పరీక్షలు.. పూర్తి కానీ సిలబస్!
ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. కానీ జిల్లాలోని సుమారు 60 శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన సిలబస్ ఇప్పటివరకు అధ్యాపకులు పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో 40 రోజుల పనిదినాలు మాత్రమే పరీక్షలకు గడువు ఉన్నా అధికారులు చెల్లించకపోవడం ఆశ్చర్యమేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రధానంగా జేఈఈ, నీట్, ఎమ్‌సెట్ వంటి ప్రధాన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
నూతన పరీక్షా విధానం ఇలా..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు అన్ని గ్రూపులకు సంబంధించి సబ్జెక్టుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. ఇందులో ఇంగ్లీషును తప్పనిసరి చేసి, సెకండ్ లాంగ్వేజ్‌ను ఐచ్ఛికం చేశారు. అలాగే సిలబస్ మార్పుతో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మ్యాథ్స్ ఏ, బీ పేపర్లును రద్దు చేశారు. కేవలం ఒకే మ్యాథ్స్ పేపరు మాత్రమే ఉంటుంది. బైపీసీలో బోటనీ, జువాలజీ సెబ్జెక్టులను కలిపి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా 100 మార్కులు ఉన్న సబ్జెక్టుల్లో 35 మార్కులు ఉత్తీర్ణతగాను, 85 మార్కులు రాత పరీక్ష ఉండే సైన్స్ సబ్జెక్టుల్లో 29 మార్కులు పాస్ మార్కులుగా నిర్ణయించారు. సైన్స్ సబ్జెక్ట్‌ల ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో కలిపి 30 మార్కులుగా నిర్ణయించారు. అంటే ఫస్ట్ ఇయర్‌లో ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులు ఉండనున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రశ్నపత్రాల్లో అర్థ, ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఎనిమిది, 16 మార్కుల ప్రశ్నలు సందించనున్నారు.
నూతన సిలబస్‌తో.. సరికొత్త పరీక్షల విధానం
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 30,275 మంది హాజరు కానున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో నూతన సిలబస్‌తో సమూల మార్పులు చేశారు. కొత్త సిలబస్‌పై అటు అధ్యాపకులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో ఈ ఏడాది గత ఏడాది కంటే ఫలితాలు మెరుగు పడే అవకాశం లేదని సాక్షాత్తు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కాగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం యథావిధిగా పాత సిలబస్, పాత పరీక్షా విధానంలో పరీక్షలు జరగనున్నాయి.


