అపాయం.. అందని అభయం
చిరుతల సంచారం.. అధికారుల నిర్లక్ష్యం
వర్సిటీల్లో రెండు చిరుతలు సంచారం!
బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు
హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్న అధికారులు
అవి సరస్వతీ నిలయాలు.. ఆ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో చిరుతల సంచారం.. ఈ పరిష్కారానికి శాశ్వత చర్యలు లేమి.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో విద్యార్థులు.. అయినా అటవీ, వర్సిటీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నిర్లక్ష్యం.. హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్న వైనం.. వెరసి ఆ వర్సిటీల్లో విద్యార్జనకు వచ్చిన వేలాది మంది యవతీ యువకులు.. కోటి ఆశలతో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
తిరుపతి సీటీ: శేషాచలం అడవులకు సమీపంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులు చిరుతల సంచారంతో కొన్నేళ్లుగా బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. గత ఏడాదిగా ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాల ప్రాంతాల్లో పలుసార్లు చిరుతలు సంచరించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అలిపిరి నుంచి జూపార్క్ రోడ్డులో గతంలో పలుసార్లు ఉద్యోగులు, యాత్రికులపై చిరుతలు దాడి చేసి గాయపరిచినా అటు అటవీశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సమాచారం
వర్సిటీల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం ఎస్వీయూ, ఎస్వీ వేదిక్, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల్లో కేవలం మూడు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. చిరుతలు సంచరించే ప్రాంతాలపై అటవీ శాఖ రాత్రి సమయాల్లో పర్యవేక్షించకపోవడంతో చిరుతల సంచారం అధికమవుతోంది. ప్రస్తుతం వర్సిటీల్లో సుమారు రెండు చిరుతలు సంచరిస్తున్న పక్క సమాచారం ఉంది. కానీ తూతూ మంత్రంగా తాత్కాలిక బోన్లను ఏర్పాటు చేసి చిరుత బోనులో దొరికితే తాము ఏదో సాధించినట్లు వ్యవహరించి, బోనులో చిక్కుకున్న చిరుతలను మామండూరు, కోడూరు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో వదులుతున్నారు. దీంతో తమ పని పూర్తి అయ్యిందని వర్సిటీ అధికారులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించరా?
వర్సిటీల్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతలకు అటవీశాఖ, వర్సిటీ అధికారులు చెక్ పెడతారా? లేదా? దీనిపై పోరాటం చేయాలా అని వర్సిటీ విద్యార్థులు అధికారుల ను హెచ్చరిస్తున్నారు. అలిపిరి నుంచి వర్సిటీల సరిహద్దుల్లో తక్షణం కంచె ఏర్పాటు చేసి, చిరుతల సంచారానికి చెక్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంచె ఏర్పాటు చేయకుంటే చిరుతల సంచారంతో జరగరాని సంఘటనలు జరిగి ప్రాణనష్టం జరిగితే వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
పట్టపగలు తిరగాలన్నా భయం
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ సమీపంలో గెస్ట్‌హౌస్ ప్రాంతంలో చిరుత ఓ శునకాన్ని చంపినట్లు అక్కడి విద్యార్థులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అటు అటవీ శాఖ అధికారులు, ఇటు వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు వర్సిటీల్లో చిరుతలు హల్ చల్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. ఈ విషయంపై వర్సిటీ అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోలేని విద్యార్థులు చెబుతున్నారు. పట్టపగలు వర్సిటీలో తిరగాలన్నా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అపాయం.. అందని అభయం


