
దంచికొట్టిన వాన
తిరుపతి తుడా : భారీ వర్షం తిరుపతిని ముంచెత్తింది. తెల్లవారుజామున 2 గంటల తర్వాత ప్రారంభమైన వర్షం ఉదయం 8 గంటల వరకు అదే జోరు కొనసాగించింది. నగరంలోని కాలువలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. నగరంలో ఎక్కడ చూసినా మోకాళ్లోతు నీళ్లు కనిపించాయి.
పొంగి ప్రవహించిన కాలువలు
జోరు వానతో ఎగువ ప్రాంతాలైన కపిలతీర్థం, మాల్వాడి గుండం, ఎస్‌వీ యూనివర్సిటీ తదితర ప్రాంతాల నుంచి వర్షపు నీరు జోరుగా ప్రవహించింది. ఈ క్రమంలో కాలువలు పొంగి రోడ్లపై పెద్ద ఎత్తున నీరు పారింది.
కాలనీలు జలమయం
భారీ వర్షానికి లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షపు నీరు పోటెత్తింది. ఇక్కడ వర్షపు నీరు ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు ప్రమాదకర స్థాయికి చేరింది. నిమిషాల వ్యవధిలోనే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయాయి . దీంతో నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేశారు. మధురానగర్, మాధవనగర్, కొర్లగుంట, మారుతి నగర్, సుబ్బారెడ్డి నగర్, చంద్రశేఖర రెడ్డి కాలనీ, కట్టకిందపల్లి, కొరమీనుగుంట, ఆటోనగర్, లక్ష్మీపురం, ఎస్‌టీవీ నగర్, గాంధీపురం పరిసర ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు వీలుపడనంతగా ఆ వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో జన జీవనానికి ఆటంకం ఏర్పడింది.
ఉరుములు... మెరుపులు
భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు.
చిరు వ్యాపారులకు దెబ్బ
తిరుమల మూడో శనివారం ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిరు వ్యాపారులు విక్రయాల కోసం శుక్రవారం సాయంత్రం నుంచి నగరంలో వ్యాపారాలను ప్రారంభించారు. ఊహించని భారీ వర్షం వ్యాపారులను దెబ్బతీసింది. భారీ వర్షానికి కూరగాయల మార్కెట్లోకి మోకాళ్లలోతులో నీళ్లు చేరడంతో కూరగాయలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
వేగంగా సహాయక చర్యలు
భారీ వర్షం నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య ఆదేశాలతో ప్రజా ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున వ్యర్థాలు చేరుకోవడంతో వర్షపు నీటిని పంపింగ్ ద్వారా తోడారు. సిబ్బంది చేతులు మీదుగా టన్నుల కొద్ది వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తరలించారు.
చంద్రగిరిలో భారీ వర్షం
చంద్రగిరి : చంద్రగిరి మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారిజామున 2 గంటల నుంచి ఉదయం 10.30గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో మండల పరిధిలోని ఏ.రంగంపేట కృష్ణాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటరమణ పూరి గుడిసె వెనుక భాగం నేలకూలడంతో ఆందోళనకు లోనయ్యాడు.

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన