
గంగమ్మ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుకండి
తిరుపతి కల్చరల్ : తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రైవేటు స్థలం కొనుగోలు కోసం మేయర్ డాక్టర్ శిరీష కుటుంబ సభ్యులు రూ.5 లక్షల విరాళాన్ని శనివారం టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా తమ కుటుంబం భాగస్వామ్యం కావాలని భావించి రూ.5 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు. గంగమ్మ ఆలయ అభివృద్ధి , గంగమ్మ జాతర విశిష్టతను దశ దిశలా వ్యాప్తి చేసి, గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి కావడంతో ఆయన చేతులగా మీదుగా ఈ విరాళాన్ని ఇవ్వడం సముచితంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దాతల సహకారంతో అమ్మవారికి వజ్ర కిరీటం చేయించడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి తిరుపతి గంగ జాతరకు అధికారిక గుర్తింపు ఇవ్వడం, ఆలయ జీర్ణోద్ధరణ, విస్తరణ పనులు, ప్రహరీ నిర్మాణం పూర్తి చేయడం వంటి అనేక కార్యక్రమాలు భూమన కరుణాకరరెడ్డి చేయించారని తెలిపారు. తిరుమల వెంకన్న చెల్లెగా పూజలందుకుంటున్న గంగమ్మను తొలుత దర్శించుకున్న తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ప్రాచీన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహహన్‌రెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు మొదటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా గంగమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, డాక్టర్ హేమకుమార్‌రెడ్డ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ రమేష్, మునయ్య, సురేష్ యాదవ్ ,చింతా రమేష్, అంకయ్య, వెంకటేష్, బత్తయ్య, పురుషోత్తం, సూరి, ఆదినారాయణ పాల్గొన్నారు.