
వాహన డ్రైవర్ల సంక్షేమానికి కృషి
తిరుపతి కల్చరల్: రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపు నిచ్చారు. కచ్చిపి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో అర్హులైన 14,375 మంది ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహన యజమానులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రూ.21.56 కోట్ల మెగా చెక్కును అందజేశారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు ఘనంగా ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నాయీబ్రాహ్మణ చైర్మన్ సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, రీజనల్ టాన్స్‌పోర్టు కమిషనర్ క్రిష్ణవేణి, హస్తకళ అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య , యూనియన్ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.