
డబ్బులొస్తే.. డ్రైనేజ్ పనులు
తిరుపతి అర్బన్ : డబ్బులొస్తే తిరుపతిలో డ్రైనేజ్ పనులు చేద్దామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తుడా ఆఫీస్‌లో ఆయన శనివారం రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు. డిసెంబర్‌లో రూ.45 కోట్ల మేరకు లే అవుట్లు వేసుకున్న వారు తుడాకు చెల్లించాల్సిన డబ్బులు వస్తాయని చెప్పారు. దాంతో డ్రైనేజ్ పనులు, తాగునీరు, రోడ్లు ఏర్పాటు చేద్దామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన అనంతరం వీధిలైట్లు ఇతర అభివృద్ధి పనులు చేద్దామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు తిరుపతి నగరంలో ముంపు ప్రాంతాలు, వర్షానికి పై భాగంలోని మార్వాడి గుంట నుంచి వచ్చే వరద నీటి ఇబ్బందుల నేపథ్యంలో చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు. ఆ పనులు కూడా చేద్దాం నిధులు మంజూరైన తర్వాత అంటూ సమాధానం ఇచ్చారు. మున్సిపాలిటి, కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు తదితర పనులను చేపట్టడానికి మూడు దశల్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఆయనతో పాటు తుడా వీసీ, జేసీ శుభం బన్సల్, తిరుపతి కమిషనర్ మౌర్య , యాదవ సంఘం చైర్మన్ నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు.