
డిప్లొమా కోర్సులకు గడువు పొడిగింపు
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో రెండేళ్ల కాలవ్యవధితో అలైడ్ అండ్ హెల్త్ కేర్ పారామెడికల్ ప్రొఫెషనల్ కోర్సులకు ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులన్నారు. ఇందులో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీలో 30 సీట్లు, డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440879943 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుమలకు చేరుకున్న ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ సీవీఎస్‌ఓ మురళీకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు దర్శనం ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ షాక్‌తో ఆవులు మృతి
కోట: విద్యుత్‌షాక్‌తో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని వావిళ్లదొరువులో చోటుచేసుకుంది. గోవిందపల్లికి చెందిన కరిముల్లా, వెంకటయ్య ఆవులు తోలుకుని వాటిని మేపేందుకు వావిళ్లదొరువు అటవీ ప్రాంతానికి వెళ్తున్నారు. అదే సమయంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి పడి ఉండడంతో ఆ వైర్లు తగిలి ఆవులు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి.