
మహారూపం
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. జిల్లా నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వెంకటగిరీయులు స్వగృహాలకు చేరుకున్నారు.
వైభవంగా రథోత్సవం
కుమ్మరివీధిలోని అమ్మవారి పుట్టింటిలో పోలేరమ్మ ప్రతిమను తయారు చేశారు. విగ్రహానికి నేత్రాలను అమర్చకుండా బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కొలువుదీర్చారు. అమ్మవారి ప్రతిమను తయారు చేసిన వెంటనే దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పోలేరమ్మను సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని రథంపై కొలువుదీర్చి జీనిగలవారి వీధికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అశేష భక్తజనం నడుమ రథోత్సవం వైభవంగా సాగింది. అక్కడ పోలేరమ్మ ప్రతిమను ప్రతిష్టించి సంపరదాయబద్ధంగా గాలి గంగులకు పూజలు నిర్వహించారు. అనంతరం బలి కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారికి కళ్లు అమర్చారు. బుగ్గ చుక్కను తీర్చిదిద్దారు. దివ్యతేజస్సుతో అలరారుతున్న పోలేరమ్మ దివ్యరూపాన్ని రథంపై ఊరేగిస్తూ.. పాతకోట మీదుగా అమ్మవారి ఆలయానికి చేర్చారు. అక్కడ వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో మహిమాన్విత ప్రతిమను ప్రతిష్టించారు. గురువారం వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనానికి పోటెత్తారు.
నేడు నిష్క్రమణం
జాతరలో భాగంగా గురువారం అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలవుతుంది. పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక మండపంలో అమ్మవారు కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం నిర్వహిస్తారు. విరూపమండపం వద్ద అమ్మవారి నిష్క్రమణ కార్యక్రమం పూర్తి చేస్తారు. దీంతో జాతర ఘట్టం పరిపూర్ణమవుతుంది.