
పడిగాపుల ప్రయాణ ం
తిరుపతి అర్బన్ : ప్రజల అవస్థలను కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేస్తూ లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తోంది. అక్కడితో ఆగకుండా తమ సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకుంటోంది. పోనీలే అనుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రజలను వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం అనంతపురంలో నిర్వహిస్తున్న చంద్రబాబు సభకు జిల్లాను 364 బస్సులను తరలించేసింది. దీంతో రెండు రోజులుగా జిల్లావాసులు నానా ఇక్కట్టు ఎదుర్కొంటున్నారు. బాబుగారి సేవకు ఆర్‌టీసీ బస్సులు వెళ్లిపోవడంతో రాకపోకలకు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఈ మేరకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. గంటకో.. రెండు గంటలకో ఓ బస్సు రావడంతో ఎక్కేందుకు పోటీపడుతున్నారు. సీటు సంగతి దేముడెరుగు, నిలబడేందుకు చోటు దొరికితే చాలు అనుకుంటూ బస్సు పైకి ఎగబడుతున్నారు. ముఖ్యమంత్రి సభకు ఇక్కడ నుంచి బస్సులను తరలించడమేంటని మండిపడుతున్నారు. దీనిపై ముందస్తుగా ప్రకటన విడుదల చేసుంటే, తమ ప్రయాణం వాయిదా అయినా వేసుకునే వాళ్లమని వాపోతున్నారు. అయితే గురువారం ఆర్టీసీ బస్సులు తిరిగి వస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు.