
ఉపాధి పనులు.. అవకతవక వేతనాలు
వరదయ్యపాళెం : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పనులు ల్పించడమే ఉపాధి హామీ పథకం లక్ష్యం. అయితే కొందరు అవినీతి పరుల కారణంగా పథకం నీరుగారిపోతోంది. అనర్హులు సైతం ఉపాధి కూలీలుగా నమోదు చేసుకుని వేతనాలు స్వాహా చేస్తున్న ఘటన బుధవారం వరదయ్యపాళెం ఎండీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన సామాజిక తనిఖీలో వెల్లడైంది. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో పలువురు వీఆర్‌ఏలు, అంగన్‌వాడీలు, దివ్యాంగ పింఛన్ పొందుతున్నవారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, చివరకు మంచానికే పరిమితమయ్యామని రూ.15వేల పింఛన్ అందుకుంటున్నవారు సైతం ఉపాధి కూలీల అవతారమెత్తి వేతనాలు పొందిన వైనం వెలుగు చూసింది. దీనిపై డ్వామా పీడీ విచారణ ఆదేశించారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఎం గణేష్ తీరుపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి కొలతల్లో తేడాలు రావడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. ఈ అవకతవకలపై ఉపాధి సిబ్బంది నుంచి రూ. 1.30లక్షలను రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే రూ. 25వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఏపీడీ సరిత, ఎస్‌టీఎం కోనయ్య, ఎస్‌ఆర్‌పీ లోకేష్ పాల్గొన్నారు.