
తుస్సుమన్న పంట బీమా
రైతులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం అన్నదాతలపై కూటమి నేతల పెత్తనం విత్తనాలు, యూరియా, డ్రోన్లు, పనిముట్ల పంపిణీలో చేతివాటం పచ్చమూక తాకిడికి కుదేలైన రైతాంగం నేడు ‘అన్నదాత పోరు’కు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. దేశానికి వెన్నెముకను నిర్దాక్షిణ్యంగా విరిచేస్తోంది. ఆరుగాలం కష్టించే అన్నదాతను నిలువునా దగా చేస్తోంది. వ్యవసాయం దండగ అనుకునే దుస్థితిలోకి రైతులను నెట్టేస్తోంది. కనీసం మాత్రం కనికరం లేకుండా అడుగడుగునా అవస్థల పాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సకాలంలో పెట్టుబడి సాయం అందించకుండా కాలయాపన చేసింది. వేరుశనగ విత్తనాలను అప్పనంగా పచ్చమూకకు పంచిపెట్టింది. అరకొరగా యూరియాను సరఫరా చేసి కర్షకులను ఇబ్బందులకు గురిచేసింది. ఎరువుల కోసం బారులు తీరే దయనీయ పరిస్థితి తీసుకువచ్చింది. చివరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సైతం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ మేరకు కూటమి సర్కార్ వైఖరిపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. వ్యవసాయానికి బాసటగా నిలిచేందుకు రంగంలోకి దూకింది. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ కింద మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆర్‌డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమైంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి అర్బన్ : ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. అధికారుల లెక్కలు ప్రకారం జిల్లావ్యాప్తంగా 5.5లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. ఈ సీజన్‌లో వరి 80వేల ఎకరాలు, మరో 20వేల ఎకరాల్లో వేరుశనగ, సజ్జ, రాగి, మినుములు, జొన్నలు ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ పరిధిలో మామిడి, నిమ్మ, మిరప, కూరగాయల తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడికి యూరియా అవసరం ఉండదు. మిగిలిన పంటలకు యూరియా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరి పంటకు మాత్రమే 50వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం 35వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం సరఫరా చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ యూరియా పంపిణీలో సైతం భారీగా గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పాస్‌పుస్తకాలు చూపిన వారికే యూరియా ఇవ్వాల్సి ఉంది. అయితే కూటమి నేతలు ఆధార్ కార్డులు చూపించి అవసరానికి మించి యూరియాను పట్టుకెళ్లినట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అలా తీసుకెళ్లిన యూరియాను బ్లాక్‌లో విక్రయించి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. సకాలంలో అదునుకు యూరియా వేయకపోవడంతో వరి దిగుబడి కూడా తగ్గినట్లు రైతులు వాపోతున్నారు. పాడి రైతులు పశుగ్రాసం కోసం యూరియా కావాలని ప్రాధేయపడినా కూటమి నేతలు కనికరించలేదని మండిపడుతున్నారు.
కూటమి నేతలకే ‘రాయితీ’
ప్రభుత్వం ప్రతి సీజన్‌లో రాయితీపై విత్తనాలు అందిస్తుంది. ప్రధానంగా వేరుశనగతోపాటు పచ్చిరొట్ట విత్తనాల్లో ప్రధానంగా జీలగలు, జనుములు, పిల్లిపెసర అందించేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లోను సక్రమంగా పంపిణీ చేశారు. రైతుల అవసరాల మేరకు స్టాక్‌ను అందుబాటులో ఉంచేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఖరీప్ సీజన్‌కు సంబందించి కేవలం చంద్రగిరి నియోజక వర్గానికి మాత్రం 3,270 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ఇచ్చారు. అవి కూడా కూటమి నేతలకు మాత్రమే. ఆ నేతలు విత్తనాలను తీసుకుని చమురు ఆడించుకునేందుకు వినియోగించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
36 డ్రోన్లు సైతం తమ వారికే..
అగ్రికల్చర్ చదువుకున్న వారికి 2023లో డ్రోన్ల వాడకంపై గుంటూరులో శిక్షణ ఇచ్చారు. వారికే 90శాతం రాయితీలో డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో శిక్షణ పొందిన వారికి కాకుండా, చదువుతో సంబంధం లేకుండా 36 డ్రోన్లు 80శాతం సబ్సిడీతో అధికార పార్టీ అనుయాయులకే కట్టబెట్టినట్లు సమాచారం. గతంలో శిక్షణ పొందిన వారికి మొండిచేయి చూపించారు.
శిక్షణ పొందా.. డ్రోన్ ఇవ్వలేదు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023 మే 16వ తేదీన డ్రోన్ ఫైలెట్‌గా పనిచేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఆ మేరకు సర్టిఫికెట్ అందించారు. డ్రోన్లు నడపడానికి పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందా. 90శాతం రాయితీతో నాకు డ్రోన్ వస్తుందని ఆశపడ్డా. 10 శాతం నగదును కూడా సిద్ధం చేసుకున్నా. అయితే కూటమి ప్రభుత్వం వేరే వాళ్లకు ఇచ్చింది. నాతోపాటు శిక్షణ పొందిన వారికి కూడా మొండిచేయి చూపింది.
– నక్కా శోభనబాబు, పెద్ద పాండూరు,
వరదయ్యపాళెం మండలం
సేవలు దూరం
గతంలో రైతు భరోసా కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. విత్తనాలు, ఎరువులతోపాటు పంటల సాగుపై సలహాలు సైతం అందించేవారు. కూటమి సర్కార్‌లో రైతు సేవాకేంద్రాలు మార్చారు. మళ్లీ రేషన్‌లైజేషన్ పేరుతో 50శాతం కేంద్రాలను తగ్గించారు.వాటిలో కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లను మరో 50శాతం తగ్గించారు. రెండు రైతు సేవా కేంద్రాలను ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు అప్పగించారు. దీంతో సేవలు దూరం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు భూములు సైతం బీడు భూములుగా మారుతున్నాయి.
– మధురెడ్డి, రైతు, చిల్లకూరు మండలం
ఆదుకోవడం లేదు
యూరియా కొరత అంశం ఒక్కటే కాదు. రైతులకు అవసరం అయిన మేరకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో అధిక ధరలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అవి నాణ్యత లేకపోవడంతో మొలకలు రావడం లేదు. వేరుశనగ కాయలను మాకు చూపించడం కూడా లేదు. కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికే పంపిణీ చేస్తున్నారు. కనీసం పచ్చిరొట్ట విత్తనాలను రాయితీల్లో ఇవ్వకపోవడం బాధాకరం. వేల సంఖ్యలో రైతులు ఉంటే నామమాత్రంగా కొందికే ఇచ్చి పంపించేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదు.
– వెంకటయ్య, రైతు, వెంకటగిరి నియోజకవర్గం
పనిముట్లతో సరిపెట్టి..
కూటమి సర్కార్ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఒక్క ట్రాక్టర్, వరికోత యంత్రాన్ని కూడా రాయితీతో ఇవ్వలేకపోయింది. అక్కడక్కడ అదీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం కేవలం 8 రకాల చిన్న చిన్న పనిముట్లు పంపిణీ చేసి సరిపెట్టేసింది. దీంతో వేలాది మంది రైతులు రాయితీ పనిముట్లపై ఆశలు వదులుకున్నారు.
రైతులను ముంచేసిన ప్రభుత్వం
రామచంద్రాపురం : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం కుదేలైందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్‌సీపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో రైతులను కలుసుకున్నారు. ఎరువుల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, సాగు ఖర్చులు భరించలేక పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, బస్తాను రూ.400 నుంచి రూ.600 విక్రయిస్తున్నారని రైతులు వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతున్నాయని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన భూమన మాట్లాడుతూ రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాత సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టే అన్నదాత పోరులో ఈ సమస్యలను బలంగా వినిపిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం రైతులతో కలసి బస్తాల్లో ధాన్యం నింపారు. అన్నదాత ఆర్థికాభివృద్ధే జగనన్న లక్ష్యమని, ఆ మేరకు వైఎస్సార్‌సీపీ సైనికులుగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు.
కూటమి సర్కార్ ఉచిత పంట బీమాను రద్దు చేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు, ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల మేరకు బీమా చెల్లించాలంటే రైతులే ముందుగా పంటను బట్టి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఖరీప్ సీజన్‌లో వరి, సజ్జ, నిమ్మ, వేరుశనగ పంటలకు, రబీ సీజన్‌లో వరి, వేరుశనగ, మామిడి పంటలు సాగుచేసిన రైతులు వాళ్లే బీమా చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది.

తుస్సుమన్న పంట బీమా

తుస్సుమన్న పంట బీమా

తుస్సుమన్న పంట బీమా