
రెవెన్యూ అధికారిపై విచారణకు ఆదేశం
తిరుపతి తుడా : తిరుపతి కార్పొరేషన్‌లో సుమారు 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్న సేతుమాధవ్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సేతుమాధవ్‌కు ఉద్యోగోన్నతి వచ్చినా రెవెన్యూ ఆఫీసర్ పోస్టును వదలకుండా ఉండడంపై ఇప్పటికే పలు పత్రికల్లో ఆరోపణలతో కథనాలు ప్రచురితమైనట్లు పేర్కొన్నారు. అలాగే తిరుపతి మున్సిపల్ అధికారి కేఎల్ వర్మ సైతం సేతుమాధవ్‌పై ఫిర్యాదు చేసిన విషయాన్ని కమిషనర్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ పూర్తి చేసి నివేదికను త్వరితగతిన పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
అడుగడుగునా అలసత్వం
తిరుపతి సిటీ : ఉన్నత విద్యామండలి అధికారులు అడుగడుగునా అలసత్వం వహిస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్ల విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశారు. ఎట్టకేలకు ప్రకియ పూర్తి చేసి విద్యార్థులకు ఆదివారం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. సోమవారం ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫోన్లకు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని పడిగాపులు కాశారు. విద్యామండలి అధికారులు మాత్రం నింపాదిగా సోమవారం రాత్రి సీట్లు కేటాయిస్తూ సమాచారం అందించారు. దీంతో సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం కళాశాలల్లో అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అయితే రెండు రోజులుగా సెల్‌ఫోన్‌లను చేతపట్టుకుని మెసేజ్ కోసం ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యామని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన అంశాల్లో అయినా అధికారులు అలసత్వం వీడాలని సూచిస్తున్నారు.
‘అన్నదాత’కు బాసటగా.. ‘పోరు’బాట
చంద్రగిరి : కూటమి ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న అన్నదాతలకు బాసటగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టిందని పార్టీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. టమాట, ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారని వెల్లడించారు. కర్షకులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు అభినయ్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షిత్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 27,410 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈక్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక రేపు
తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీకాళహస్తిలోని ఎస్వీ ఎస్వీ డిగ్రీ బాలుర కళాశాల ఆవరణలో బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్చరీ అండర్–11, 14, 17, 19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్ పీడీ వెంకటరమణ తెలిపారు. పోటీలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన వయసు నిర్ధారణ పత్రాలను తీసుకురావాలని, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్కుల లిస్ట్ తీసుకురావాలని కోరారు. వివరాలకు 92905 02041, 70135 82801 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.