
డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యం
తిరుపతి కల్చరల్ : డప్పు కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దళిత డప్పు కళాకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కుమార్‌రెడ్డి, మారెళ్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఏపీ ఫౌండేషన్ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల డప్పు కళాకారలు సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం డప్పు కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేసిందని, ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం అవి చెల్లవంటూ ఇబ్బంది పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని డప్పు, డ్రమ్స్, పంబ, జముకులు, తీన్మార్ వంటి 18 నుంచి 70 ఏళ్ల వరకు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డప్పు కళాకారులకు కూడా పింఛన్‌ను రూ.5 వేలకు పెంచాలని కోరారు. డిసెంబర్‌లో రాష్ట్ర స్థాయి మహాసభ ఏర్పాటు చేసి డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం, నేతలు మురగారెడ్డి, పి.రెడ్డెప్ప, అంజయ్య, మురళి, సహదేవయ్య, వెంకటేష్, రామయ్య పాల్గొన్నారు.