
పటిష్టంగా 20సూత్రాల అమలు
తిరుపతి అర్బన్ : స్వర్ణాంధ్ర–2047లో భాగంగా 20 సూత్రాలను పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్‌ఓ నరసింహులుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్, అమృత 1.0, విద్యా, వైద్య, ఉపాధిహామీ శాఖలకు సంబంధించి చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష స్వర్ణాంధ్ర–2047 నెరవేర్చే దిశగా పనిచేయాలని సూచించారు. అమృత పథకంలో భాగంగా పట్టణాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం మంజూరైన నగదును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు.