
శ్రీవారి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
తిరుపతి క్రైం : తిరుమలలో ఈనెల 24వ తేదీ నుంచి జరగబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని ఈసారి కూడా అదే తరహాలో జరగాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాలన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు. తిరుమలలోని బాలాజీ నగర్‌తో పాటు పాప వినాశనం ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఆటో డ్రైవర్లు, జీపు డ్రైవర్లు భక్తులతో ఏ విధంగా వ్యవహరించాలో అవగాహన కల్పించాలన్నారు. తిరుమలలో పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ నిర్వహించాలని ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. 400 మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దానిపైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్మ్‌డ్ అడిషనల్ ఎస్పీకి సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు తిరుమలలో ఏ రూట్‌లో వెళ్లాలి.. అనే విషయం ఇప్పటికే నిర్ధారించుకోవాలన్నారు. ఇంటిగ్రేట్ చెక్ పోస్టులు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి, తిరుమలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి , శ్రీవారి మెట్టు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెక్టార్లో సీసీ కెమెరాలతో పాటు సోలార్‌తో పనిచేసే కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల దర్శనం అనంతరం ఎలా వెళ్లాలి అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహర్ ఆచారీ, శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటనారాయణ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.