
క్రీడలతో మానసికోల్లాసం
తిరుపతి సిటీ : శారీరక , మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరమని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఎస్వీయూ స్టేడియంలో శనివారం జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడుతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగులలో స్నేహ భావం కల్పించడంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి క్రీడలు అవసరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జట్టుతో పాటు టీటీడీ ఉద్యోగులు జట్టు, ఎస్వీయూ ఉద్యోగుల జట్టు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎన్‌ఎస్‌యూ, అమరరాజ జట్లు క్రికెట్ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముత్తు, టీటీడీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణ, ఆర్గనైజర్ యుగంధర్, చంద్రు, 12 జట్ల కెప్టెన్లు , క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ మ్యాచ్ కలెక్టర్ జట్టుకు, ఎస్వీయూ జట్ల మధ్య జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
పోలేరమ్మ జాతర కమిటీ ఏర్పాటు
వెంకటగిరిరూరల్ : ఈనెల 10,11వ తేదీల్లో జరగనున్న శ్రీ పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి జాతర కమిటీని పట్టణంలోని వీరయ్య కల్యాణ మండపంలో శనివారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి పాలవర్గం వర్గం పేర్లను చదివి వినిపించారు. మురళీకృష్ణ, చంద్రశేఖర్, శివప్రసాద్, టీవీ కృష్ణ, యామిని, జగదీశ్వరి, కలపాటి నాగమణి, రామారావు అనీల్, తిరుపతిరావు, మదనపల్లి సావిత్రమ్మ, సత్య కిరణ్మయి, ప్రసాద్‌తో కమిటీని ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 6న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశం
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 6న (సోమవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ విభాగానికి చెందిన తిరుపతి జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రతీత్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కమిటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని వివరించారు.
గ్రహణం రోజున ముక్కంటికి ప్రత్యేక అభిషేకాలు
శ్రీకాళహస్తి : చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేకమైన గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఈనెలలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఆదివారం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం, 21న సూర్య గ్రహణం. ఈ రెండు భారత దేశంలో దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆదివారం చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై 8వ తేదీ వేకువజామున 1.26 గంటలకు ముగుస్తుందని శ్రీకాళహస్తీశ్వరాలయంలోని పండితులు వివరించారు. 7వ తేదీ రాత్రి 11.42 గంటలకు చంద్రుడు పూర్తిగా కనబడడని తెలిపారు. ముల్లోకాలను ఏలే ముక్కంటీశుడు తనకు అలంకరించే కవచంలో తొమ్మిది గ్రహాలను 27 నక్షత్రాలను పొందు పరుచుకున్నారు కాబట్టి ఆ స్వామికి శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని తెలిపారు.
పలువురికి పదవులు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురికి పదవులు వరించాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంటు) నియమించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వీరికి పదవులు కేటాయించినట్లు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన దయాసాగర్‌రెడ్డికి నగరి, చంద్రగిరి, ఎం.కృష్ణమూర్తికి కుప్పం, పూతలపట్టు, వెంకట్‌రెడ్డియాదవ్‌కు పలమనేరు, చిత్తూరు, అనీషారెడ్డికి పుంగనూరు, మదనపల్లె, రాకేష్‌రెడ్డికి జీడీనెల్లూరు, తంబళ్లపల్లెను కేటాయించారు. తిరుపతి జిల్లాకు చెందిన బీరేంద్రవర్మకు గుడూరు, సూళ్లూరుపేట, ఓ.గిరిధర్‌రెడ్డికి శ్రీకాళహస్తి, తిరుపతి, కే.కల్పలతరెడ్డికి వెంకటగిరి, సత్యవేడును కేటాయించారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, సంబంధిత రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు.