
మహిళా సాధికారతపై జాతీయ సదస్సు
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా మహిళా సాధికారత జాతీయ సదస్సును చేపట్టనున్న నేపథ్యంలో సమష్టిగా విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు ఉంటుందని వెల్లడించారు. ఆ మేరకు ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌తో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్యతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలన చేపట్టారు. ముందుగా సదస్సు చేపట్టనున్న రాహుల్ కన్వెన్షన్ హాల్‌తో పాటు చంద్రగిరి కోటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సదస్సుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు రానున్నారని చెప్పారు. ప్రధానంగా లోకసభ, శాసన సభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు , ఇతర ప్రముఖులు రానున్నారని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటను అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఆదేశించారు. కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ లైట్ అండ్ సౌండ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే చంద్రగిరి కోటకు చేరుకునే మార్గంలో అప్రోచ్ రోడ్లు, తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, ప్రొటోకాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, అడిషినల్ ఎస్పీ రవిమనోహరాచారి, డీపీఓ సుశీలాదేవి, తిరుపతి, చంద్రగిరి డీఎస్పీలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేందర్ నాయుడు, టూరిజం ఆర్‌డీ రమణ ప్రసాద్, గురుస్వామి శెట్టి తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతపై జాతీయ సదస్సు