
కాపర్ తీగల చోరీలో నిందితుల అరెస్టు
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీ పారిశ్రామికవాడలోని సియోన్ పరిశ్రమలో ఇటీవల జరిగిన కాపర్ తీగల చోరీలో ఐదుగురు నిందితులతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 29న సియోన్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ తీగలను వేరు చేసి అందులోని కాపర్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఆ మేరకు బుధవారం సత్యవేడు మండలం మల్లవారిపాళెం ఈస్ట్‌కు చెందిన వెట్టి శరవణ, మల్లవారిపాళెం టౌన్‌షిప్‌కు చెందిన ఎం.రాజేష్, ఇరుగుళం గ్రామానికి చెందిన జి.జానకిరామన్, తడ మండలం వేనాడు గ్రామానికి చెందిన కుదిరి పోతయ్య అలియాస్ నాగరాజు, సూళ్లూరుపేట మండలం పేర్నాడుకు చెందిన నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి వద్ద ఉన్న రూ.2 లక్షలు విలువైన 200 కాపర్ వైర్లు, మూడు మోటారు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సత్యవేడు కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. కేసు ఛేదించడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది ముత్తు, మునిశేఖర్, హరిబాబు, రాజశేఖర్, రాజును జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.