
కొండపై తట్టకోసమేనా ఈ ఆరాటం
దళారీ బతుకును మరిచావా కిరణ్ రాయల్ ? సుగాలి ప్రీతి చనిపోయింది చంద్రబాబు ప్రభుత్వంలోనే అని తెలుసుకో భూమన కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు ఉందా? వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసు యాదవ్ ధ్వజం
తిరుపతి మంగళం : కొండపైన తట్ట కోసం, దర్శనాల టిక్కెట్ల కోసం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మెప్పు పొందేందుకు కరుణాకర్ అన్నపై అవాకులు చవాకులు మర్యాదగా ఉండదని కిరణ్‌రాయల్‌ను వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్ హెచ్చరించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తిరుపతిలో సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు, కొండ దర్శనం టికెట్లు అమ్ముకున్న దళారీ బతుకును మరిచావా కిరణ్ రాయల్. తిరుపతి బఫున్, జోకర్, దళారీ వంటి సంఘాల అధ్యక్షుడు, వీటికి అంబాసిడర్ కిరణ్ రాయల్ అని చెప్పవచ్చు. వీటితోపాటు దుబాయ్, సింగపూర్ ముఠాలతో సంబంధాలున్నట్లు రాష్ట్రమంతా కోడై కూస్తోంది. భూమన కరుణాకర రెడ్డి అన్నను విమర్శించే స్థాయి నీదా? కొండపైన బ్లాక్ టికెట్లు అమ్ముతూ పోలీసులకు దొరికితే విడిపించమని కరుణన్నను కాళ్లు పట్టుకుని ప్రాథేయపడిన సంగతి మరిచావా? 2017లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి చనిపోతే ఆ సంఘటనను మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో అని మాట్లాడడం సిగ్గుచేటు. జగనన్న అధికారంలోకి వచ్చాకే సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల పొలం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, రెవెన్యూలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించిన గొప్ప వ్యక్తి జగనన్న. కరుణాకర్ అన్న లాంటి పెద్దవాళ్లను విమర్శించి ఫేమస్ అవ్వాలనుకుంటే తిరుపతి ప్రజలే పళ్లు రాలగొడతారు. జనసేన పార్టీ నుంచి నిన్ను బహిష్కరించినా సిగ్గు లేకుండా జనసేన కార్యకర్త అని చెప్పుకుని మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటు’’ అంటూ వాసు యాదవ్ ధ్వజమెత్తారు.