
ప్రభుత్వ వైఫల్యంతో డయేరియా విజృంభణ
రేణిగుంట : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డయేరియా విలయ తాండవం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లిలో ఇప్పటి వరకు 70 మందికి డయేరియా వ్యాపించగా అందులో ఒకరు మృతి చెందారు. బాలాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు పండ్లు, ఓఆర్‌ఎస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి జగనన్న చికిత్స అందించారని గుర్తు చేశారు. డాక్టర్, సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ఎక్కడ చూసినా విష జ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కోలుకునే విధంగా కలెక్టర్, వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందని జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని మరొక గ్రామంలో ఈ విధంగా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధ గుంట సుధాకర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, సింగల్ విండో అధ్యక్షుడు గణేష్ రెడ్డి, సర్పంచ్ మంజుల, సీనియర్ నాయకులు గంగయ్య, యోగేశ్వర్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, రేణిగుంట సర్పంచ్ నగేషం, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీ ఉల్లా, మునిరెడ్డి పాల్గొన్నారు.