
పొదుపు సంఘాలకు రుణాలు
తిరుపతి అర్బన్ : సంవత్సరంలో ఎంత అప్పు కావాల్సి ఉందో పొదుపు సంఘం సభ్యుల నుంచే ముందే సమాచారం తీసుకుంటారని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ వెల్లడించారు. మంగళవారం ఆమె తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో పొదుపు సంఘం సభ్యులతో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పొదుపు సంఘం లీడర్లతో పాటు డీఆర్‌డీఏ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలకు తావు లేకుండా మొబైల్ యాప్‌ను సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి పొదుపు సభ్యురాలును లక్షాధికారిగా తయారు చేయడానికి మహిళలు వ్యాపార రంగంలోనూ రాణించాలని చెప్పారు. 2025–25 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తిరుపతి జిల్లాలోనే సెర్ప్ వార్షిక రుణ ప్రణాళిక ద్వారా సుమారు రూ.3,200 కోట్లకు పైగా మహిళా సంఘం సభ్యులు వివిధ రుణాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. మరోవైపు కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, పశుసంవర్ధక , ఉద్యానవన , పరిశ్రమలు, చేనేత, హ్యాండీ క్రాఫ్ట్‌స్ తదితర శాఖల అనుసంధానంతో బ్యాంకు వారి సహకారంతో జీవనోపాధుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ శోభనబాబును ఆదేశించారు. మండలాల వారీగా బ్యాంకు మేనేజర్లు, అనుబంధ శాఖలు, మండల స్థాయి అధికారులు, సెర్ప్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి మహిళా సంఘం సభ్యుల జీవనోపాధుల పెంపునకు తోడ్పాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, అడిషన్ పీడీ ప్రభావతి, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.