
పారిశుద్ధ్యలోపంపై డీపీఓ ఆగ్రహం
రేణిగుంట : పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై గురువారం సాక్షిలో ‘చెత్తగించకంటే చిక్కులే’ కథనం రావడంతో డీపీఓ సుశీలాదేవి స్పందించారు. గురువారం ఉదయం రేణిగుంట పంచాయతీలోని వీధులను పరిశీలించారు. వార్డులలోని ప్రజలను తడి, పొడి చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.రావడం లేదని స్థానికులు తెలపడంతో పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పారిశుద్ధ్య లోపం రేణిగుంటలో కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభురావు, ఈవో మాధవి, శానిటేషన్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ సర్పంచ్ నగేషంతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇద్దరికీ కలిపి 250 కుటుంబాలను కేటాయించాలని,ఆ ఇళ్లలో చెత్త సేకరణ వీధుల శుభ్రం వంటి బాధ్యతలు వారికి అప్పగించాలని ఆదేశించారు. మరోసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఎక్కడైనా పారిశుద్ధ్య లోపం ఉంటే సంబంధిత పారిశుద్ధ్య కార్మికులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలాలలో చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లు అరెస్ట్
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్ర చందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను గురువారం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ జి.బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐ మురళీధరరెడ్డి టీమ్ బుధవారం రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు , సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారని వారిని చుట్టు ముట్టే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించగా నలుగురిని పట్టుకున్నారు. వీరిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. పట్టుబడిన వారిని 22 దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్స్ నిర్వహణపై ఆరా
తిరుపతి అర్బన్ : ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆరా తీశారు. ఇటీవల నాణ్యతలేని ఆహారం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని ఓ హాస్టల్ విద్యార్థులు ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పలువురు అధికారులు కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ హాస్టల్‌పై తీసుకుంటున్న చర్యలను సీఎస్‌కు వివరించారు.

పారిశుద్ధ్యలోపంపై డీపీఓ ఆగ్రహం

పారిశుద్ధ్యలోపంపై డీపీఓ ఆగ్రహం