అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

Jun 25 2025 1:19 AM | Updated on Jun 25 2025 1:39 AM

బారులు తీరిన ట్రాక్టర్లు

గుడిపాల సరిహద్దులోని ఓ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడులోని కాట్పాడి కింగ్‌స్టన్‌ కాలేజీ వరకు మామిడి కాయల ట్రాక్టర్లు క్యూకట్టాయి. గత మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రతరమవుతోంది. అన్‌లోడింగ్‌కు రైతులు రోడ్డుపైనే కాపు కాస్తున్నారు. తిండీలేక తిప్పలు పడుతున్నారు. గుడిపాలలోని కొత్తపల్లి వద్ద ఇదే పరిస్థితి ఎదరవుతోంది. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి వద్ద ఉన్న ఫ్యాక్టరీ వద్ద కూడా మూడు కి.మీ మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఇక్కడ కాయలు అన్‌లోడింగ్‌కు ఐదు రోజులకుపైనే పడుతోంది. దీని దెబ్బకు ఆయా ఫ్యాక్టరీల నిర్వాహకులు కాయలు కొనలేమని చేతులెత్తేశారు. చిత్తూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ సైతం మామిడి కొనుగోలు చేయలేమని బోర్డు పెట్టేస్తున్నాయి. పూతలపట్టు, బంగారుపాళ్యం, తవణంపల్లి, కార్వేటినగరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఫ్యాక్టరీలు రైతులను వేధిస్తున్నాయి.

జిల్లాలో పళ్ల గుజ్జు పరిశ్రమదారులు సిండికేట్‌ అయ్యారు. మామిడి రేటును చెప్పకుండా నాన్చుతున్నారు. ఇన్నాళ్లూ రూ.8 నుంచి రూ.5 వరకు పాటపాడారు. తీరా కూటమి ప్రభుత్వం పరువుపోతోందని నోటిమాటగా అమలవుతున్న మద్దతు ధరకు తాళం వేసేశారు. దీని దెబ్బకు రెండు రోజులుగా మామిడిరేట్లు మూగబోయాయి. రైతులకు ఇస్తున్న బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ధర వివరాలను ప్రస్తావించకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు.

కాణిపాకం/తిరుపతి రూరల్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇందులో 31 ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఇవీ ఈనెల 6 నుంచి తోతాపురి కొనుగోలును ప్రారంభించాయి. ఫ్యాక్టరీలు తోతాపురి కేజీ రూ.8కి కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున కేజీకి రూ.4 చొప్పన రైతులకు ప్రోత్సాహక నిధి ఇస్తామని పాట పాడింది. ఫ్యాక్టరీలు టోకన్లు జారీచేసి కాయలు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈటోకన్ల జారీ గందర గోళంగా మారడంతో ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. మధ్యలో పోలీసులు, అధికారులు కల్పించుకుని రైతులందరికీ టోకెన్లు ఇప్పించే ప్రయత్నాలు చేశారు.

కొనేవారేరీ?

టోకన్ల గోల ముదరడంతో అధికారులు కొత్తపల్లవిని అందుకున్నారు. ఇకపై టోకన్లు అవసరం లేదని ప్రకటించారు. కాయలు కోత కోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని బోర్డులు పెట్టేస్తున్నాయి. కాయలు కోసి తెచ్చిన వారిని తిప్పి పంపిచేస్తున్నాయి. లేకుంటే ఐదు రోజుల తర్వాత వరస నంబరు వేసి రైతు ఫలాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. సిఫార్సులుంటే అప్పటికప్పుడే దింపుకుంటున్నాయి. మామిడి విపత్తును అదునుగా తీసుకుని ఫ్యాక్టరీలు సిండికేట్‌ అయ్యాయి. మామిడి రైతులను దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నాయి.

ధర ఎంత?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది రైతుల వరకు సుమారు 1.5 లక్ష టన్నుల మామిడి కాయలు ఫ్యాక్టరీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో తొలుత వచ్చిన రైతులకు ఫ్యాక్టరీ నిర్వాహకులు తోతాపురి కేజీ ధర రూ.8ని రుచిచూపించారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు కేజీ ధర రూ.6ని తీసుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు రూ.5ని చెప్పి ముఖం చాటేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రైతులకు పెద్ద షాక్‌ ఇస్తున్నా యి. తోతాపురి ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో చెప్పడం లేదు.

గుండె గు‘బిల్లు’

ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఏ ఒక్కరైతుకు కూడా బిల్లులో ఫ్యాక్టరీలు ధరల విషయాన్ని ప్రస్తావించ లేదు. కేవలం కాయలు, ట్రాక్టర్‌ లోడింగ్‌తో సహా ఎంత బరువు ఉంది.. ఖాళీ ట్రక్కుతో ఎంత బరువు ఉంది.. అని మాత్రమే బిల్లుల్లో ప్రస్తావిస్తున్నారు. ధర విషయాన్ని ఖాళీగా చూపుతున్నారు. ధరలు చెప్పకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ధరల బోర్డు పెట్టాలి కదా..?

ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. మా కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. విధిలేని పరిస్థితుల్లో కాయలు దింపుకుంటే చాలనుకుంటున్నాము. దీన్ని అదునుగా చేసుకుని ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎంతకు కొంటున్నాయో కూడా చెప్పడం లేదు. బయట మాత్రం కాయలు కొనలేం.. టోకన్లు ఇవ్వలే మని బోర్డులు పెడుతున్నారు. ధరలపై కూడా బోర్డు పెట్టాలి కదా. దీనిపై అధికారులు కూడా నోరు విప్పడం లేదు.

–గోవర్థన్‌,

పెనుమూరు మండలం

జిల్లాలో మ్యాంగో ఫ్యాక్టరీలు సిండికేట్‌

ఇన్నాళ్లు తోతాపురి కిలో రూ. 8, రూ.6, రూ.5 అంటూ ప్రచారం

ప్రస్తుతం ధరలు చెప్పని వైనం

అయోమయంలో రైతులు

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 1
1/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 2
2/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 3
3/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 4
4/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 5
5/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం! 6
6/6

అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement