
● 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం ● 40 ఎకరా
సాక్షిటాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, అనుపల్లి నుంచి బండపల్లి, 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లి ప్రాంతం మీదుగా తచ్చూరు నేషనల్ హైవే రోడ్డు ఉంది. దీనిపక్కనే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఇదే అదునుగా భూకుబేరులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ముడుపులకు ఆశపడిన కొందరు సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయోనని గాలించారు. మేత బీడు, వంక భూములు, డీకేటీ భూములు, అటవీశాఖ భూములను వరుసగా దోచుకునేందుకు పక్కా స్కెచ్చేశారు. సర్వేయర్‌తో స్కెచ్ గీయించుకుని వీర్వోలను బుట్టలో వేసుకున్నారు. భూకుబేరుల కుటుంబీకులు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీగా మలుచుకున్నారు. వాళ్లకే తెలియకుండా 25 నుంచి 30 మంది వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల మేర పలు సర్వే నంబర్లలో భూములు కేటాయించారు.
ఎగువమాసాపల్లి వద్ద ఏం చేశారంటే..
194. వెంకటాపురానికి చెందిన కూటమి నేత, భూకుబేరుడు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దూరపు బంధువులు కూడా. ఈ నేపథ్యంలో 194 వెంకటాపురం వద్ద ఎందుకు భూ సమస్య అంటూ వదలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రూట్ మార్చుకుని ఎగువమాసాపల్లి ప్రాంతంలో 20 ఎకరాల భూములున్నాయని తెలుసుకున్నారు. అక్కడి అటవీశాఖ, డీకేటీ భూములను ఆక్రమించే పనిలో పడ్డారు. అనుచరులను రంగంలోకి దింపి జేసీబీలతో చదును చేయించారు. మూడో రోజు ముచ్చటగా ఎగువమాసాపల్లికి చెందిన కూటమి నేత, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అఽధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే అది అటవీ భూమి అని తేలింది.
బాస్ ఉన్నారనే..
అధికారం ఉంది.. బాస్(తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే) అండ ఉంది.. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భూకుబేరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆక్రమిత భూముల జోలికి ఎవరు అడ్డొచ్చినా బాస్ పేరుతో బెదిరిస్తున్నారు. ‘భూములు నావి కావు.. మా బాస్‌వే... మీ వల్లయ్యింది చేసుకోండి’ అంటూ భూకుబేరులు బహిరంగంగా చెబుతున్నారు. మేమంతా బినామీలే.. .. టచ్ చేస్తే ఎలికాప్టర్‌లోనే దిగుతారని భయపెడుతున్నారు. కాగా ఈ భూమి పక్కాగా చేతుల్లోకి వస్తే బినామీలు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా డీల్ సెట్ చేశారని సమాచారం. అందుకే ఆ బినామీలు కూడా భూ కుబేరుల వెనుక బ్రహ్మస్తంలా పనిచేస్తున్నారు.
సర్వేలో అటవీ భూమిగానే గుర్తించాం
ఎగువమాసాపల్లిలో ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించాం. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. జేసీబీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వారు ఇచ్చిన సమాచారం మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నాం. వీటిని సోమవారం డీఎఫ్‌కు అందిస్తాం. ఆక్రమణదారులపై తదిపరి చర్యలు ఉంటాయి. రెవెన్యూ అధికారులతో సర్వే చేయగా ఆక్రమిత భూమి అటవీ భూములని తేలింది.
–థామస్, ఎఫ్‌ఆర్‌ఓ, చిత్తూరు ఈస్ట్
కబ్జా చేశారనేది వాస్తవం
భూ ఆక్రమణపై ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడు చదును చేసిన భూమి అటవీశాఖ భూమి అని తేలింది. రెవెన్యూ భూముల విషయానికి సంబంధించి తహసీల్దార్ కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు అని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, చిత్తూరు
ఆక్రమణలపై చర్యలేవి?
ఇక అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు పెట్టేందుకు జంకుతున్నారు. కూటమి నేతల ఒత్తిడి ఉండడంతో అటవీశాఖ అధికారులు నోరువిప్పలేక పోతున్నారు. భూ ఆక్రమణదారులు పరారీలో ఉన్నారని సాకుచూపుతున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల కనుసన్నల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే భూ ఆక్రమణల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

● 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం ● 40 ఎకరా