
కుట్టు మిషన్ల నిధుల స్వాహా
● బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి నేతలు ● మొత్తం 144 ట్రైనింగ్ సెంటర్లకు గాను 25 మాత్రమే ఏర్పాటు ● శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు కొట్టేసే యత్నం ● ఒక్కో మహిళ పేరిట రూ.15,700 కాజేసేందుకు సన్నద్ధం ● మండిపడుతున్న బీసీ సంఘాలు
●
మోసం చేసింది
కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది. కుట్టు శిక్షణతోపాటు మిషన్‌కు ఒక్కో బీసీ మహిళకు రూ.23 వేలు కేటాయించాల్సి ఉంది. అయితే శిక్షణకు రూ.3వేలు, మిషన్‌కు రూ.4300 మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన మొత్తాన్ని కూటమి నేతలు నొక్కేస్తున్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
– గీతా యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర నేత
తిరుపతి అర్బన్ : జిల్లాలో మొత్తం 144 కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. బీసీ కార్పొరేషన్ కింద ఒక్కో సెంటర్‌లో 42 మంది నిరుపేద బీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తొలి ప్రాధాన్యతగా పొదుపు సంఘంలోని మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది, అయితే ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 25 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగిలిన 119 శిక్షణ కేంద్రాల సంగతి పూర్తిగా మరిచారు. శిక్షణ సమయంలో వసతులను తూతూమంత్రంగా కల్పించారు.
నిబంధనలు తుంగలో తొక్కి...
కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీలో నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలపాటు ఇవ్వాల్సి ఉంది. వారంలో 6 రోజులు శిక్షణ ఉంటుంది. అలా మొత్తం 45 రోజుల్లో 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. తర్వాత కుట్టు మిషన్లు అందించాలి. అయితే కూటమి నేతలు పలువురు బినామీలను రంగంలోకి దించి, అసలు శిక్షణకు రాకుండానే మిషన్లు కాజేసేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. కుట్టు శిక్షణతోపాటు మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మూడు విడతల్లో నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలోనూ నిబంధలను గాలికి వదిలేసినట్లు సమాచారం.

కుట్టు మిషన్ల నిధుల స్వాహా