
దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ
తిరుపతి అర్బన్: దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు చేతుల మీదుగా నిర్వహించారు. జిల్లాలో వేలాదిమంది దివ్యాంగుల్లో డిగ్రీ చదువుతున్న 24 మందికి ల్యాప్‌టాప్‌లు ఇంటర్మీడియట్ చదువుకున్న 24 మందికి స్మార్ట్ ఫోన్లు అందించారు. దివ్యాంగుల వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వై.శ్రీనివాసులు, సీఆర్‌అండ్‌ఎమ్ ఓజీకే రాజశేఖర్ వెల్లడించారు. ఒక్కో ల్యాప్‌టాప్ విలువ రూ.42వేలు, ఒక్కో స్మార్ట్ ఫోన్ విలువ రూ.16వేలుగా పేర్కొన్నారు.
విద్యుత్ పథకాలపై సమీక్ష
తిరుపతి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పథకాల అమలుపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ వ్యవసాయం రంగంలో విద్యుత్ నష్టాలను తగ్గించడమే ఆర్‌డీఎస్‌ఎస్ పథకం లక్ష్యమన్నారు. జిల్లాలో 11 కేవీ అగ్రికల్చర్ ఫీడర్స్ ఉన్నాయని తెలిపారు. అందులో గృహ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులను స్పష్టంగా విభజన చేయాలని సూచించారు. జిల్లాలో6213 వ్యవసాయ పంపు సెట్లకి 142 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పీఎం కుసుం ద్వారా 28 మెగా వాట్స్ సోలార్ ప్యానెన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రైతులకు పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేయడం కోసం పీఎం కుసుం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సురేంద్రనాయుడు, ఈఈలు వాసవి, లత, బాలాజీ పాల్గొన్నారు.
నర్సింగ్ వృత్తి మహోన్నతం
తిరుపతి తుడా : వైద్యరంగంలో నర్సింగ్ వృత్తి మహోన్నతమైనదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని సోమవారం స్విమ్స్ ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్వచ్ఛంద సేవకురాలిగా సమాజానికి నర్సింగ్ సేవలందించి వృత్తికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నర్సులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోగులకు సేవలందించాలని సూచించారు. కరోనా కాలంలో స్విమ్స్‌లో నర్సులు అందించిన సేవలను వెలకట్టలేమని కొనియాడారు. కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, కాలేజీ అఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, ఫార్మా కాలేజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ కాంతమ్మ, హెడ్ నర్స్ సునీత, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి: ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి సోమవారం శ్రీకాళహస్తీశ్వరాలయం సమీపంలో మృతి చెందాడు. సత్యవేడు మండలం పాలగుంట గ్రామానికి చెందిన రాధాకృష్ణ(41) శ్రీకాళహస్తీశ్వరాలయం వద్దకు వచ్చాడు. పూటుగా మద్యం తాగి మత్తులో నాలుగో గేటు సమీపంలో ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద నిద్రించాడు. గొంతెండడంతో నిద్రలోనే మృతిచెందాడు. భక్తులు గుర్తించి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేసిన సీఐ గోపి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ