
కుయుక్తులతో కూటమి కుమ్మక్కు!
● ఎట్టకేలకు ముక్కంటి ఆలయ పార్కింగ్ టెండర్ కై వసం ● ప్రశ్నార్థకంగానే శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి వాటా
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ పార్కింగ్ టెండర్‌ను కూటమి నేతలు కుమ్మకై ్క దక్కించుకున్నారు. దేవదాయశాఖ అంచనాల మేరకు బిడ్ రావడంతో కారు పార్కింగ్ టెండర్ ఖరారైంది. అయితే కూటమి నేతలు దౌర్జన్యంతో వేరే వారు ఎవరూ టెండర్ వేయకుండా భయబ్రాంతులకు గురిచేశారు.
తక్కువగా కొట్టేయాలని..
గతంలో సుమారు కారు పార్కింగ్ టెండర్ రూ.కోటి వరకు ఉండేది. అప్పట్లో ఎన్నికల కోడ్ రావడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు ఎలాగైనా తక్కువకే టెండర్ కొట్టేయాలని యత్నించారు. టెండర్ వేయడానికి ఎవరూ వేయకూడదని హుకుం జారీ చేశారు. తక్కువకు కోట్ చేసి టెండర్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆలయం ఏడాదిగా పార్కింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సుమారు రూ.2కోట్ల వరకు రాబడి వచ్చింది. ఇందుకోసం 30మంది ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు పోగా సుమారు రూ.1.50 కోట్ల వరకు ఆదాయం మిగిలింది. దీంతో రూ.1.5 కోట్లకు పైగా బిడ్ ఉంటేనే టెండర్ ఆమోదం తెలుపుతామని దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గత్యంతరం లేక కూటమి నేతలు యహిత అసోసియేట్స్, ఎస్టీ అసోసియేట్స్ అనే రెండు సంస్థల పేరుతో బిడ్‌లు వేశారు. చివరకు ఎస్టీ అసోసియేట్స్ రూ.1.59కోట్లకు టెండర్ దక్కించుకుంది.
ఎక్కడ పడితే అక్కడే..
స్వర్ణముఖి నది, గాలిగోపురం, శివయ్యగోపురం ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌చేస్తున్నారు. అలాగే నాలుగో గేట్ నుంచి ఒకటో గేట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కార్పెట్‌పై సైతం వాహనాలు నిలిపేస్తున్నారు. దీనిపై పార్కింగ్ నిర్వాహకులు దృష్టి సారించాల్సిన అవసరముందని భక్తులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే వాహనాలకు సరైన పార్కింగ్ చూపకుండా డబ్బులు వసూలు చేయడం వంటి అక్రమాలకు చోటు ఇవ్వవద్దని సూచిస్తున్నారు.
మున్సిపాలిటీకి మొండిచెయ్యేనా?
శ్రీకాళహస్తి ఆలయానికి పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీకి వాటా ఇవ్వాల్సి ఉంది. గతంలో సుమారు 30శాతం వాటాను పురపాలక సంఘానికి అందించేవారు. 201718లో ఆ వాటాను నిలిపివేశారు. దీంతో ఇప్పటి వరకు సుమారు రూ.2కోట్ల వరకు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది. అలాగే స్కిట్ కళాశాలకు సంబంధించి మరో రూ.2కోట్ల బకాయి ఉంది. అసలే శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితిలో ముక్కంటి ఆలయం ద్వారా రూ.4కోట్లు బకాయిలు విడుదల చేస్తే పట్టణాభివృద్ధికి ఉపయోగపడుతుందని స్థానికులు కోరుతున్నారు. అయితే పాలకులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పురపాలక కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ పార్కింగ్‌కు సంబంధించి ఆలయం ద్వారా రావాల్సిన బకాయిలను ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఆలయ, దేవదాయశాఖ అధికారులకు విన్నవించినట్లు వెల్లడించారు.
లోపాయికారీ ఒప్పందం
పార్కింగ్ టెండర్ ఎవరికి వచ్చినా ఇరు పార్టీలవారు పంచుకోవాలని టీడీపీ, జనసేన నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జనసేన తరుఫున యహిత రూ.1.55 కోట్లకు టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే మరో రూ.4లక్షలు అదనంగా ఎస్టీ అసోసియేట్స్ రూ.1.59 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఇక పార్కింగ్ సొమ్మును ఇరు పార్టీ వారు పంచుకుంటారా.. లేక వివాదాలకు దిగుతారో వేచిచూడాల్సిందే.