
విలువలే వెంగమాంబ రచనలు
తిరుపతి కల్చరల్ : తరిగొండ వెంగమాంబ రచనల్లో భక్తి, నైతిక విలువలే కనిపిస్తాయని కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు నల్లపరెడ్డి ఈశ్వర్‌రెడ్డి కొనియాడారు. కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతోత్సవాల సందర్భంగా ఆదివారం తిరుపతి అన్నమాచాచ్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధ్యానం చేసే వారికన్నా ధాన్యం తయారు చేసే వారే గొప్పని తెలిపారు. అనంతరం వెంగమాంబ రచించిన నృసింహ శతకం వైశిష్ట్యంపై ఉపన్యసించారు. . ప్రతి మనిషిలో దయ, శక్తి, నిజం మాట్లాడే స్వభావం ఉంటే, దేవుడు అందరిలో కనిపిస్తారనే భావన వెంగమాంబ రచనల్లో దర్శనమిస్తుందన్నారు. పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ వి.కృష్ణవేణి మాట్లాడుతూ తిరుమలలో జీవ సమాధి కేవలం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారికే ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు ప్రదర్శించిన సంగీత కచేరి, హరికథ గానం భక్తులను ఆకట్టుకుంది. అంతకు ముందు తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో శ్వేత ఇన్‌చార్జి సంచాలకుడు కె.రాజగోపాలరావు, తిరుపతి కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ మునిగోటి వేణుగోపాల్, డాక్టర్ సంగీతం కేశవులు, ఏఈఓ శ్రీదేవి పాల్గొన్నారు.