
పాకాలలో శాంతి ర్యాలీ
పాకాల: పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన సత్యసాయి జిల్లా మురళీ నాయక్‌కు వైఎస్‌ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నివాళులర్పించారు. శనివారం మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పాకాలలో రైల్వే గేటు నుంచి చిత్తూరు రోడ్డు వరకు సైనికులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌లో మన దేశ సైనికులు 9 పాకిస్తానీ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. వీరమణం పొందిన మురళీ నాయక్‌కు ఘన నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సంతోషకరమని ఇకనైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సైనికులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.