రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రేణిగుంట, వడమాలపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసి, వాటిని విక్రయిస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గాజులమండ్యం పోలీసులు పట్టుకుని కటకటాలకు పంపించారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లాలో ఆవుల దొంగతనాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో రేణిగుంట రూరల్ సీఐ ఎం.మంజునాథ్‌రెడ్డి నేతృత్వంలో గాజులమండ్యం ఎస్‌ఐ టీవీ.సుధాకర్, పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా నిర్వహించారు.
తిరుపతి–చైన్నె ప్రధాన రహదారి ఆయిల్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక బొలేరో వాహనంలో ఆవులను రవాణా చేస్తూ కనిపించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హర్యాణా కు చెందిన 8 మంది, తమిళనాడు ఊత్తుకోటకు చెందిన కబూర్ బాషా అని తేలింది. కబూర్ బాషా ఈ గ్యాంగ్‌ను ఏర్పరిచి గత ఆరు నెలలుగా రేణిగుంట, వడమాలపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసి, వాటిని కసాయికి తరలిస్తునట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు నిందితుల నుంచి నాలుగు ఆవులు, ఒక బొలేరో వ్యాన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు.

అంతర్రాష్ట్ర ఆవుల దొంగల ముఠా అరెస్ట్