
ఎవడ్రా మన వాహనాలను ఆపేది?
● కలువాయిలో చెలరేగిపోయిన రేషన్ మాఫియా ● మీడియా ప్రతినిధులపై వాహనంతో దాడికి యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఎవడ్రా మన వాహనాలనాపేది.. అడ్డొస్తే తొక్కేయండి. నేను చూసుకుంటా’.. అంటూ రేషన్ మాఫియా కేటుగాళ్లు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన మీడియా ప్రతినిధులపైనే దాడికి యత్నించారు. ఈ ఘటన శనివారం శ్రీపోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కలువాయిలో చోటుచేసుకుంది. వివ రాలు.. కలువాయి మండలంలో కూటమి ప్రభత్వం ఏర్పడినప్పటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కలువాయి సమీపంలోనే ఓప్రైవేట్ స్కూల్ వద్ద నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మిల్లర్లకు ఒక్కో బస్తా రూ.1000 నుంచి రూ.1,500 వందల వరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో విజన్‌టెక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రేషన్ బియ్యాన్ని శనివారం తెల్లవారు జామున తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీడియో ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో కేటుగాల్లు రెచ్చిపోయారు. రేషన్ బియ్యాన్ని తరలిచే వాహనంతో మీడియా ప్రతినిధులను తొక్కేసే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా మీడియా ప్రతినిధులు తప్పించుకున్నారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.