
ప్రత్యేక అలంకరణలో నందీశ్వరుడు
తిరుమల : తిరుమల గోగర్భం డ్యామ్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం జెర్రిపోతు కలకలం సృస్టించింది. వెంటనే టీటీడీ అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌నాయుడుకు సమాచారం అందించారు. ఆయన సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఆరు అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.
వైభవంగా ప్రదోష పూజలు
నాగలాపురం: సురుటుపళ్లి శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. నందీశ్వరునికి, వాల్మీకిస్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఉభయదారులుగా ఊత్తుకోటైకి చెందిన వినోద్ వ్యవహరించారు. వీరికి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజిరెడ్డి ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కె.ఆనంద్, జి.మునివేలు, పి.కవిత సందీప్, అర్చకులు పాల్గొన్నారు.
రేపటి నుంచి సత్వ ఇన్ఫోటెక్ ప్లేస్‌మెంట్స్
తిరుపతి కల్చరల్: సాప్ట్‌వేర్ టెక్నాలజీపై డిగ్రీ, పీజీ అభ్యర్థులు పట్టు సాధించేలా చేసి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా సత్వ ఇన్ఫోటెక్ కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఈనెల 12, 13వ తేదీల్లో ప్లేస్‌మెంట్స్ నిర్వహించనున్నట్లు సంస్థ ఎండీ గిరీష్‌కుమార్ కుప్పిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ ప్లేస్‌మెంట్స్ ద్వారా మంచి ప్యాకేజీతో ఏదైనా డిగ్రీ, పీజీ, బీటెన్ ఉత్తీర్ణత సాధించిన వారికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం మదనపల్లె విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో, బుధవారం పుత్తూరు కార్వేటినగరం రోడ్డులోని ఎస్వీ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్లేస్‌మెంట్స్ ఉంటాయని వివరించారు. వివరాలకు సత్వ ఇన్ఫోటెక్ డాట్‌కామ్ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
దుమ్మురేపిన ఎడ్ల పందేలు
శ్రీరంగరాజపురం: యువత కేరింతలు... జనం చప్పట్లు... కోడె గిత్తల జోరుతో మండలంలోని ఉడలమకుర్తి పంచాయతీ ఎన్‌ఎండీ పురంలో ఆదివారం నిర్వహించిన ఎడ్ల పందేలు దుమ్మురేపాయి. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ఎడ్ల పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ముందుగా ఎడ్లకు పలకలు, బెలూన్‌లు కట్టి పందేనికి ఉసిగొల్పారు. అంతకు ముందే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువత అల్లి వద్ద పలకల కోసం నిలబడ్డారు. ఈలలు వేస్తూ తరిమిన కోడెగిత్తలు రంకెలేసుకుంటూ జనాలపై దూసుకుపోయాయి. ఎడ్లను నిలువరించి పలకలు పట్టేందుకు యువత పోటీ పడ్డారు. పలకలు పట్టిన యువత విజయ దరహాసంతో చిందులు వేశారు. అయితే కొన్ని ఎడ్లు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా దూసుకెళ్లాయి. ఎడ్ల కొందరు ఎడ్ల కింద పడి గాయపడ్డారు. ఎడ్ల పందేలు కోలాహాలంగా సాగాయి.

దూసుకుపోతున్న కోడె గిత్తలు

పాముతో భాస్కర్‌నాయుడు