GHMC-Hyderabad: షరా మామూలే.. అక్రమాలు ఆగలే! 

This Year 2022 Also In GHMC Corruption Illegalities Continue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో ఈ సంవత్సరం సైతం  అక్రమాలు, అవినీతి షరామామూలుగా కొనసాగాయి. బర్త్‌ సర్టిఫికెట్ల జారీలో అవినీతి గుర్తించి ఏళ్లవుతున్నా నిరోధించలేకపోయారు. గతంలోవి కాక ఇటీవలే మూడువేలకు పైగా బర్త్‌ సర్టిఫికెట్లు అవినీతి మార్గాల్లో జారీ కావడం పోలీసులు గుర్తించారు. బర్త్‌ సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలోనూ లోపాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి.

ఇక ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుమతుల్లేని నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి అదనపు అంతస్తులను  ప్రజలు ఫొటోలతో సహ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దిక్కులేదు. ఐదంతస్తుల వరకు  నిర్మాణ అనుమతుల అధికారం జోన్లకే కట్టబెట్టినప్పటి నుంచి జోనల్, సర్కిల్‌ స్థాయిల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట లేకుండాపోయింది. నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న  ఎల్‌బీనగర్‌ వంటి జోన్లలో ఈపరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.  
 
పురోగతిలో ఎస్సార్‌డీపీ.. 
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం పూర్తయిన వాటిల్లో షేక్‌పేట ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లైఓవర్, బహదూర్‌పురా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్‌ ఫ్లైఓవర్,  నాగోల్‌ ఫ్లైఓవర్,  చాంద్రాయణగుట్ట  ఎక్స్‌టెన్షన్‌ ఫ్లైఓవర్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఎల్‌బీనగర్‌  కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్‌ ఆర్‌యూబీ, ఖైతలాపూర్‌ ఆర్‌ఓబీలున్నాయి.  

కాగితాల్లోనే మూసీ బ్రిడ్జిలు.. 
మూసీపై నిర్మించనున్న 15 బ్రిడ్జిలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిల్లో నాలుగింటిని జీహెచ్‌ఎంసీ నిర్మించాల్సి ఉండగా, ఇంతవరకు  ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్‌ఎన్‌డీపీ)కింద దాదాపు రూ.985 కోట్ల పనుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.    
 
కొన్ని ఎఫ్‌ఓబీలు, వైకుంఠధామాలు.. 
పాదచారులు రోడ్డు దాటేందుకు కొన్ని ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు(ఎఫ్‌ఓబీ), స్పోర్ట్స్‌పార్కులు, వైకుంఠధామాలు, మలీ్టపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు తదితరాలు ప్రారంభమయ్యాయి. పాత ఇళ్ల స్థానే  వాటిని కూలి్చవేసి కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో 210,  ఓల్డ్‌మారేడ్‌పల్లిలో 468 మంది లబ్ధిదారులకు అందజేశారు.  
 
ఆగని అగ్ని ప్రమాదాలు.. 
న్యూబోయిగూడ స్క్రాప్‌ దుకాణం, సికింద్రాబాద్‌ రూబీ హోటల్, జూబ్లీహిల్స్‌  ర్యాడిసన్‌ బ్లూప్లాజా హోటళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు ఫైర్‌సేఫ్టీ లోపాల్ని బట్టబయలు చేశాయి. చెత్త తరలించేందుకు కొత్తగా 60  వాహనాలు వినియోగంలోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్‌లలో హైదరాబాద్‌ 26వ స్థానానికి 
దిగజారింది.  
 
పెరిగిన సీఆర్‌ఎంపీ రోడ్లు.. 
సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్న రహదారులు 709 కి.మీ.ల నుంచి 811 కి.మీ.లకు పెరిగాయి. 32 అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో సిట్టింగ్‌ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించినా అన్నింట్లో పూర్తికాలేదు. కొత్తగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. ఆహారకల్తీ నిరోధానికి మొబైల్‌ ల్యాబ్‌ వినియోగంలోకి వచ్చింది. గ్రీనరీ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగి, హైదరాబాద్‌ ‘ట్రీసిటీ ఆఫ్‌  వరల్డ్‌’గా గుర్తింపు పొందింది.  

(చదవండి:  గన్‌ చూపించి కారును ఆపిన ఎస్సై..  అవాక్కైన వాహనదారులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top